ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి దేశంలో, రాష్ట్రంలో అసలు నిర్మాణ సంస్థలే లేనట్లుగా, ఉన్నా అవేవీ పనికి రావన్నట్లుగా జపాన్, సింగపూర్ సంస్థల చుట్టూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారు. వాటి గొంతెమ్మ కోర్కెలు తీర్చడం చాలా కష్టంగానే ఉన్నా ఆయనకు వాటి మీదే మోజు పడుతుండటం విశేషం.
అమరావతి నిర్మాణ ఖర్చు సింగపూర్ సంస్థలే పూర్తిగా భరిస్తాయి కనుక అందుకు ప్రతిఫలంగా వాటికి రాజధానిలోనే ముఖ్యమైన ప్రాంతాలలో భూమిని ఇవ్వవలసి ఉంటుంది. భూమికి సంబంధించి ఏవైనా న్యాయపరమైన వివాదాలు, సమస్యలు తలెత్తిన్నట్లయితే, వాటిని పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అవి తేల్చి చెప్పాయి. అందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వంతో ఏదైనా విషయంలో వివాదం వస్తే దానిని తాము పేర్కొన్న సంస్థ మధ్యవర్తిత్వంతో లండన్ లోనే పరిష్కరించాల్సి ఉంటుందని సింగపూర్ సంస్థలు కొత్తగా షరతు పెట్టినట్లు తెలుస్తోంది. సింగపూర్ సంస్థ అంతర్జాతీయ సంస్థ కనుక ఆవిధంగా కోరుతుండవచ్చు. కానీ సుదీర్గ కాలంపాటు సాగే రాజధాని నిర్మాణంలో ఎప్పుడో అప్పుడు ఏదో ఒక విషయంలో వాటికీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం రాకుండా ఉండదు. అప్పుడు ఆ సమస్య లండన్ లో పరిష్కారం కావాలంటే ఇంకా ఏదయినా జరుగవచ్చు. ఇంకా ఊహించని కొత్త సమస్యలు పుట్టుకు రావచ్చు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ షరతుకి అంగీకరించడంలేదని తెలుస్తోంది. ఇంకా నిర్మాణ పనులు మొదలుపెట్టక ముందే ఇన్ని షరతులు విదిస్తున్న సింగపూర్ సంస్థలతో ఒప్పందం చేసుకొని చేజేతులా సమస్యలని సృష్టించుకోవడం కంటే, రాష్ట్రంలోనే ఉన్న అనేక మంచిపేరున్న నిర్మాణ సంస్థల చేత నిర్మించుకొంటే తక్షణమే నిర్మాణ పనులు మొదలుపెట్టవచ్చు కదా? అవి ప్రభుత్వ షరతుల ప్రకారమే పనులు చేస్తాయి కదా? రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బు లేదనే కారణమే అయితే దాని కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.25,000 కోట్లు ఇస్తానని హామీ ఇస్తోంది. ఇప్పటికే సుమారు రూ. 3,000 కోట్లు విడుదల చేసింది కూడా. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వీలును బట్టి, అవసరాన్ని బట్టి దశల వారిగా రాజధాని కోసం కొంత పెట్టుబడి పెట్టవచ్చు. లేదా రాజధాని నిర్మాణ పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటిని దేశీయ నిర్మాణ సంస్థలకే ఇచ్చి, సింగపూర్ సంస్థలకి ఇస్తామన్న భూమినే వాటికే ఇస్తే అవే పెట్టుబడి పెట్టి రాజధానిని నిర్మిస్తాయి కదా? అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించవచ్చు.
ఇప్పటికే రెండేళ్ళు గడిచిపోయాయి. సింగపూర్ సంస్థల చుట్టూ ఇంకా ఇలాగే ఉపగ్రహంలాగా తిరుగుతుంటే, మిగిలిన మూడేళ్ళు కూడా పూర్తయిపోవచ్చు. అప్పుడు మిగిలేది శూన్యమే. రాజధాని నిర్మాణం విషయంలో ఇప్పడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకోబోయే నిర్ణయం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై, ప్రజలపై, ప్రభుత్వంపై చాలా ప్రభావం చూపుతుంది. కనీసం మరో 15-20 ఏళ్ల పాటు సాగే రాజధాని నిర్మాణ పనులను విదేశీ కంపెనీలకు కట్టబెట్టి వాటితో ఇబ్బందులు పడటం కంటే మనకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ నమ్మకంగా పనిచేసే స్వదేశీ సంస్థలకే ఇవ్వడమే అన్ని విధాల మంచిది కదా.