తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం పేరుకే కానీ అంతర్జాతీయ విమానాలు రాకపోకలు గగనంగా మారాయి. అయితే తాజాగా నేరుగా సింగపూర్ కు విమానసర్వీసు ప్రారంభం అయింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఎక్కువగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కుచేరుకుని అక్కడ్నుంచి తిరుపతి వస్తున్నారు. అలాంటి వారి విజ్ఞప్తుల మేరకు నేరుగా సింగపూర్ నుంచి సర్వీస్ నడపాలని నిర్ణయించారు.తాజాగా ఆ సర్వీస్ ప్రారంభమయింది.
సింగపూర్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తిరుపతి ఎయిర్ పోర్టుకు.. అలాగే తిరుపతి నుంచి నేరుగా సింగపూర్ కు వెళ్లవచ్చు. దీని వల్ల దర్శనం కోసం దేశాలు దాటి వచ్చే వచ్చే శ్రీవారి భక్తులకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో సింగపూర్ కు విజయవాడ నుంచి సర్వీస్ ఉండేది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేశారు. విజయవాడకూ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు స్టేటస్ ఉంది. అక్కడ్నుంచి మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు పెరగాల్సి ఉంది.
తిరుపతి టు సింగపూర్ సర్వీస్ కేవలం భక్తులకే కాకుండా ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికీ ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంది. తిరుపతి, శ్రీసిటీల్లో పెద్ద ఎత్తున అంతర్జాతీయ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టారు. వారు తమ కంపెనీల కార్యకలాపాల కోసం తరచూ వస్తూంటారు. ఇలాంటివారికి .. సింగపూర్ సర్వీస్ అనుకూలంగా ఉంటుంది.