అమరావతి నిర్మాణంలో మళ్లీ సింగపూర్ భాగస్వమ్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీఫ్ సెక్రటరీ విజయానంద్ తో సింగపూర్ బృందం ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ సందర్భంగా వారు అమరావతి నిర్మాణాలను కూడా పరిశీలించి వచ్చారు. నిర్మాణ పనులు జరుగుతున్న వైనంతో పాటు సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధిని పట్టాలెక్కించేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. సింగపూర్ ప్రతినిధి బృందం పర్యటనతో మరోసారి అమరావతి నిర్మాణంలో వారు భాగస్వామ్యమయ్యే అవకాశాలపై చర్చ ప్రారంభమయింది.
ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ, సుస్థిర ప్రభుత్వం ఖాయమన్న భావన ఏర్పడటంతో గతంలో అభివృద్ధిలో భాగస్వామ్యం అయిన వారంతా మళ్లీ ముందుకు వస్తున్నారు. అమరావతి నిర్మాణంలో మొదట్లో సింగపూర్ ది కీలక పాత్ర. ఒప్పందాలు కూడా పూర్తయిన దశలో జగన్ అధికారంలోకి వచ్చి మొత్తం క్యాన్సిల్ చేసేశారు. సింగపూర్ ప్రభుత్వం సీరియస్ గా ఒప్పందాలు చేసుకున్న తర్వాత కారణాలు లేకుండా క్యాన్సిల్ చేసుకుంటే అలాంటి వ్యవస్థలతో పని చేయడానికి అసలు సిద్ధపడదు. కానీ అమరావతికి ఉచితంగా సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. అందుకే అమరావతి నిర్మాణంలో మరోసారి భాగస్వామ్యమయ్యే అవకాశాలపై ఆశలు ప్రారంభమవుతున్నాయి.
సింగపూర్ సహకరిస్తే.. అమరావతిలో మరిన్ని ప్రైవేటు సంస్థలు వస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణ పనులు చేయవచ్చు. అంతర్జాతీయ కంపెనీలు కూడా సింగపూర్ బ్రాండ్ చూసి అమరావతికి వచ్చే అవకాశం ఉంది. సింగపూర్ ప్రతినిధి బృందం పర్యటనపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.