సినీయర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ సినిమా తీయబోతున్నారని, అది బయోపిక్ అని తెలుగు 360 ఇది వరకే చెప్పింది. ఇప్పుడు ఆ బయోపిక్ ఎవరిదో సమాచారం కూడా సేకరించింది. బెంగళూరు నాగ రత్నమ్మ కథని సింగీతం తెరపై చూపించబోతున్నారు. మైసూరులో జన్మించిన నాగ రత్నమ్మ జీవితంలో ఎన్నో విశేషాలున్నాయి. ఆమె జీవితం ఆదర్శప్రాయం. సంగీత, నాట్య రంగాలకు ఆమె ఎనలేని సేవ చేసింది. దేవదాసి గా పుట్టి – సంగీతకారిణిగా ఎదిగిన ఆమె ప్రస్థానంలో ఉన్నో మలుపులున్నాయి. చివరి దశలో ఆమె యోగినిగా మారింది. రచనలూ చేసింది. తన సంపాదనంతా కళలకూ, కళోద్యమాలకూ కేటాయించింది. త్యాగరాజ స్వామి అంటే ఆరాధన భావం ఎక్కువ. అందుకే త్యాగరాజు సమాధి శిధిలావస్థకు చేరుకున్నప్పుడు సొంత డబ్బుతో మరమత్తులు చేయించి – ఆ ప్రదేశాన్ని ఓ అందమైన ఉద్యానవనంగా మార్చింది. అక్కడే ప్రతీ యేటా త్యాగరాజ సమారాధనోత్సవాలు జరుగుతుంటాయి. నాగరత్నమ్మ ఆ సమాధిముందే ప్రాణాల్ని కోల్పోయింది. ఆ ఆవరణలోనే నాగరత్నమ్మ అంత్యక్రియలు జరిపారు. ఈ కథనే ఇప్పుడు సంగీతం సినిమాగా తీస్తున్నారు. ఓ స్టార్ హీరోయిన్ కోసం వేట సాగుతోంది. ఎవరు ఈ కథని ఎంచుకున్నా.. అంత్యంత సాహసోపేతమైన పాత్ర అనే చెప్పాలి. మరి ఆ అవకాశం ఎవరు అందిపుచ్చుకుంటారో??