బేబీ… ఈమధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు. సోషల్ మీడియా చలవ వల్ల… ఓ గాయని ఈమధ్యే వెలుగులోకి వచ్చింది. ఆమె పేరే బేబీ. తను పాటలు పాడుతున్న వీడియో ఒకటి.. యూ ట్యూబ్ లో హల్ చల్ చేయడం, అది సినిమా వాళ్ల దృష్టిలో పడిపోవడం జరిగిపోయాయి. గాయకుడు రఘు కుంచె.. బేబీతో ఓ పాట పాడించేశారు కూడా. ఇప్పుడు ఈ గాయని మెగా స్టార్ చిరంజీవి ఇంట్లో కనిపించింది. బేబీ పాటల వీడియోని చూసిన చిరు సతీమణి సురేఖ.. `ఎలాగైనా.. బేబీని వెదికి ఇంటికి తీసుకురావాలి` అని చిరంజీవిని కోరార్ట. దాంతో చిరు సంగీత దర్శకుడు కోటి ద్వారా బేబీ చిరునామా కనుక్కుని, ఇంటికి మరీ పిలిపించుకొచ్చారు. ఇటీవల చిరు ఇంట్లో బేబీ అడుగు పెట్టింది. చిరు, కోటి, సురేఖల సమక్షంలో కొన్ని పాటలు పాడి వినిపించింది.ప్రతీ పాటకూ చిరు మురిసిపోతూ.. బేబీని ప్రోత్సహించారు. త్వరలో రెహమాన్ సంగీత సారథ్యంలోనూ బేబీ పాట పాడబోతోందని సంగీత దర్శకుడు కోటి తెలిపారు. చిరు దృష్టిలో పడిందంటే.. మొత్తంగా చిత్రసీమ దృష్టిలో పడిపోయినట్టే. ఈ పల్లె కోయిలమ్మ మరిన్ని సినిమా పాటలు పాడాలని, సంగీత ప్రియుల్ని అలరించాలని కోరుకుందాం.