కల్పన… ఓ వెర్సటైల్ సింగర్. చాలా సూపర్ హిట్ గీతాలు ఆలపించారు. గాయనిగా ఓ దశలో బిజీగా గడిపారు.
”నిత్యం ఏకంత క్షణమే అడిగా..యుద్ధం ఎరుగని లోకం అడిగా” అనే పాట ఆమెను చాలా పాపులర్ చేసింది. ఈటీవీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కల్పన ఈ పాటని పాడిన విధానం శ్రోతల్ని ముగ్థుల్ని చేసింది. ఇలాంటి సింగర్ ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతోంది. ఆత్యహత్యా ప్రయత్నం చేసి, ఓ ఆసుపత్రిలో చేరడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
నిజాం పేటలోని ఓ గేటెడ్ కమ్యునిటీలో నివాసం ఉంటున్నారు కల్పన. ఆమె భర్త చెన్నై వెళ్లారు. రెండు రోజుల నుంచీ తలుపులు తీయకపోవడంతో చుట్టు పక్కల వాళ్లకు అనుమానం వచ్చింది. వాళ్లు పోలీసులకు విషయం చెప్పారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి, తలుపులు బద్దలుకొట్టుకొని లోపలకు వెళ్లారు. ఆ సమయంలో కల్పన అచేతనంగా పడి ఉన్నారు. కల్పన నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారన్న విషయం పోలీసులకు అర్థమైంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం కల్పన ఫొటోల్ని చూసినవాళ్లంతా ‘ఇదేంటి ఇలా అయిపోయారు’ అని ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడూ హుషారుగా చలాకీగా ఉండే కల్పన అచేతనంగా పడి ఉండడం ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పీక్కుపోయిన కల్పనని చూస్తుంటే చాలా రోజులుగా ఆమె సరైన ఆహారం తీసుకొంటున్నారా, ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారా? అనే అనుమానాలు వేస్తున్నాయి. కల్పన ఇంట్లో ఒంటరిగా ఉండడం, మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడ్డారా, లేదంటే వెనుక ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? అనే దిశగా పోలీసులు విచారణ ప్రారంభించారు.
`నిత్యం ఏకాంత క్షణమే అడిగా` అనే పాట చాలామంది అమ్మాయిలకు మనోధైర్యాన్ని కలిగించింది. చైతన్యం రగిలించింది. అలాంటి పాట పాడిన కల్పన… ఇప్పుడు ఆ మనోధైర్యమే కొరవడి ఆత్మహత్యకు సిద్ధం అవ్వడం నిజంగా విధిరాతే. ఆమె త్వరగా కోలుకోవాలని, ఎప్పటిలానే మంచి పాటలు పాడాలని సంగీతాభిమానులు కోరుకొంటున్నారు. గెట్ వెల్ సూన్.