గాయని మధుప్రియ ఆమె భర్త శ్రీకాంత్ కుటుంబ కలహాలతో పోలీస్ స్టేషన్, మీడియా గడప తొక్కడంతో అందరి దృష్టిలో పడ్డారు. శనివారం రాత్రి ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం, ఆ తరువాత పోలీస్ స్టేషన్లలో పిర్యాదులు చేసుకోవడం వరకు వెళ్లి చేజేతులా సంసారాన్ని రోడ్డు మీదకు ఈడ్చుకొన్నారు. ఆదివారం మధ్యాహ్నం వారిరువురికీ పోలీసుల సమక్షంలో మానసిక వైద్యులు సుమారు 4 గంటల పాటు కౌన్సిలింగ్ చేసిన తరువాత వారిద్దరూ రాజీకి సిద్దపడ్డారు. కానీ మళ్ళీ రెండుమూడు రోజుల తరువాత మరొక్కసారి వారిరువురికీ మానసిక వైద్యులు కౌన్సిలింగ్ ఇస్తారు. అంతవరకు తన తల్లితండ్రుల ఇంట్లోనే ఉంటుంది. ఆ తరువాతనే తను ఒక నిర్ణయం తీసుకొంటానని మధుప్రియ చెప్పింది.
తమ కాపురంలో మధుప్రియ తల్లితండ్రులు జోక్యం చేసుకోకూడదని శ్రీకాంత్ షరతు విధించడంతో ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అయినట్లు భావించలేము. పరిస్థితి ఇంత వరకు వచ్చిన తరువాత వారిని దూరంగా ఉంచేందుకు మధుప్రియ అంగీకరించకపోవచ్చును లేదా వారు అంగీకరించకపోవచ్చును లేదా మధుప్రియ కూడా శ్రీకాంత్ తల్లితండ్రులను దూరంగా ఉంచామని కోరవచ్చును. కనుక వారిని కలపాలని ప్రయత్నించే ముందు వారి పెద్దల మధ్య కూడా రాజీ కుదర్చడం చాలా అవసరమేననిపిస్తోంది. ఇటువంటి కుటుంబ వివాదాలను పోలీసులు, మానసిక వైద్యులు ఇదివరకు చాలానే పరిష్కరించి ఉన్నారు కనుక వీరి సమస్యను కూడా పరిష్కరిస్తారనే భావించవచ్చును.