బాలీవుడ్ లో రోహిత్ శెట్టి సినిమాలకు ఓ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సౌత్ టచ్‌తో మంచి మసాలా దినుసులతో సినిమాలు చేయడంలో రోహిత్ దిట్ట. సింగమ్ సిరీస్ లో వచ్చిన సినిమాలన్నీ కమర్షియల్ గా బాగా ఆడాయి. ఇప్పుడు ఆయన ‘సింగమ్ ఎగైన్’ రూపొందించారు. నవంబరు 1న విడుదల అవుతోంది. అజయ్ దేవగణ్, కరీనా కపూర్ జంటగా నటించారు. ఈ సినిమా నిండా స్పెషల్ ఎప్పీరియన్స్లే. దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, విక్కీ కౌశల్… అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. దీపికది అయితే ఫుల్ లెంగ్త్ పాత్రే. రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ దాదాపు 5 నిమిషాల నిడివితో కట్ చేశారు. దాదాపుగా అన్ని పాత్రలన్నీ ఈ ట్రైలర్ లో పరిచయం చేశారు. కథేమిటో క్లుప్తంగానూ చెప్పేశారు.
రామాయణ గాథని రిప్లికా చేస్తూ సాగే కథ ఇది. రాముడి లాంటి హీరో. సీత లాంటి హీరోయిన్. ఇప్పుడు రావణుడిలాంటి విలన్… సీతకు ఎత్తుకెళ్లిపోతాడు. అప్పుట్లో రాముడు హనుమంతుడి సహాయంతో…సీతని ఎలా కాపాడుకొన్నాడో, ఇప్పుటి రాముడు కూడా ఆ విధంగానే తన సీతను దక్కించుకొంటాడు. అదెలా అనేదే కథ. హిందుత్వం, మహారాష్ట్రీయన్ల మనో భావాలు, వాళ్ల సెంటిమెంట్ ని ఈసారి దర్శకుడు రోహిత్ శెట్టి బాగానే పట్టుకొన్నాడనిపించింది. ట్రైలర్ లో చాలా చోట్ల రామాయణగాథని లింక్ చేస్తూ సింబాకిల్ షాట్లు తీశాడు. అప్పటి పాత్రల్ని కూడా తెరపైకి తీసుకొచ్చాడు. రాముడి కథ, హిందుత్వం… ఈరోజుల్లో మంచి కమర్షియల్ వస్తువు అయిపోయింది. సో.. అదే దారిలో ఈ సినిమానీ రూపొందించారనిపిస్తుంది. లాజిక్ ని వదిలేసి చూస్తే రోహిత్ శెట్టి సినిమాలు మ్యాజిక్ చేస్తాయి. ఆ లక్షణం ‘సింగమ్ ఎగైన్’లో కనిపిస్తోంది.