గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన నేతల్లో కలవరం మొదలైంది. అక్రమ కట్టడాలపై ఇప్పటికే యాక్షన్ ప్రారంభం కావడంతో ఈ పరిణామం అరెస్టుల వరకు సాగుతుందా…? అని వైసీపీ నేతలు లోలోపల టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలోనే సేఫ్ జోన్ లో ఉండేలా కొంతమంది పార్టీని వీడెందుకు సిద్దపడుతుండగా.. మరికొంతమంది ముందు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలకు పాల్పడిన నేతల్లో ఓ రకమైన అలజడి కనిపిస్తుండగా..ముఖ్యంగా విశాఖ వైసీపీ నేతలు నోటీసులు, అరెస్ట్ భయంతో వణికిపోతున్నారు. అక్రమాలపై ఫిర్యాదులు కూడా వస్తుండటంతో అధికారులు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారోనని టెన్షన్ పడుతున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ గుజువాకలో ఎలాంటి అనుమతి లేకుండానే చేపట్టిన బిజినెస్ కాంప్లెక్స్ నిర్మాణం చట్టవిరుద్దమని దాంతో తొందరలో ఆ భవనం కూల్చివేత తప్పదని తెలుస్తోంది. గతంలో తాము వ్యవహరించిన కక్ష సాధింపు చర్యలు ఇప్పుడు తమ మెడకు చుట్టుకుంటాయని ఆయన ఆందోళన చెందుతున్నారు.
మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన అనుచరుడు జీవీల పరిస్థితి దయనీయంగా మారింది. క్రైస్తవ భూమిలో ఎంవీవీ చేపడుతోన్న నిర్మాణాలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో..ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. దీంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, దీనికంతటికీ కారణం విజయసాయి రెడ్డినేనని సదరు నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో అయ్యన్నపాత్రుడు ఇంటి గోడలు కూల్చడం, పల్లా శ్రీనివాస్ వాణిజ్య సముదాయం కూల్చడం వంటి చర్యలకు ఆదేశించడంతో ఇప్పుడు అవి రివర్స్ అవుతాయని అమర్ నాథ్, ఎంవీవీ సత్యనారాయణలూ టెన్షన్ పడుతున్నారు.