అల్లు అరవింద్ తన నిర్మాణంలో సినిమాకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో పరిశ్రమలో అందరికి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ అంటే తెలుగు సిని పరిశ్రమలో గొప్ప చరిత్ర కలిగిన సంస్థ. అయితే ప్రస్తుతం ఆ సంస్థ నుండి ఎక్కువ సినిమాలు రావట్లేదు కాని అదే బ్యానర్ నుండి చిన్న సినిమాల కోసం ఏర్పరచిన రెండో సంస్థ (గీతా ఆర్ట్స్ -2) నుండి మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ప్రస్తుతం అల్లు అరవింద్ నిర్మాణంలో తన ఇద్దరు తనయుల సినిమాలు వస్తుండటం విశేషం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న సినిమా సరైనోడు.. బోయపాటి మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ తో పాటుగా బన్ని స్టైలిష్ నటనతోడై వస్తున్న ఈ సినిమాలో బన్ని ఓ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనున్నాడని టాక్. ఇక ఇదే బ్యానర్లో అల్లు వారి రెండో వారసుడు అల్లు శిరీష్, పరశురాం దర్శకత్వంలో చేస్తున్న సినిమా సెట్స్ మీదుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
అల్లు అరవింద్ ఈ రెండు సినిమాల శాటిలైట్ రైట్స్ జెమిని వారికి భారీ మొత్తంగా అమ్మాడని తెలుస్తుంది. ప్రస్తుతం క్రేజ్ దృష్ట్యా అల్లు అర్జున్ టాప్ హీరోల్లో ఒకడిగా ఉండటం చేత తన సినిమా భారీగానే శాటిలైట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఎటుకూడి అల్లు శిరీష్ అంతగా ప్రేక్షకుల్లో గుర్తింపు రాబట్టుకోలేకపోయాడు కాబట్టి తన సినిమాను అల్లు అర్జున్ సినిమాతో కలిసి తెగ్గొట్టేశాడు అల్లు అరవింద్. అయితే రెండు సినిమాలను జెమిని వారు 15 కోట్లకు తీసుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. అల్లు అర్జున్ సినిమాతో పాటుగా శిరీష్ సినిమాను రైట్స్ వదిలిన అరవింద్ కు ఏమాత్రం లాభం చేకూరుతుందో చూడాలి.