వరంగల్ ఉప ఎన్నికలకి తెరాస వసునూరి దయాకర్ పేరుని ఖరారు చేయగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల రాజయ్యని తన అభ్యర్ధిని ఖరారు చేసినట్లు తాజా సమాచారం. తెరాస అధినేత మొదట జి.రవికుమార్ పేరును ప్రతిపాదించి తరువాత దయాకర్ పేరును ఖరారు చేయగా, కాంగ్రెస్ పార్టీ మొదట పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ ని నిలబెట్టాలనుకొంది. కానీ ఆయన పోటీ చేసేందుకు నిరాకరించడంతో అక్కడి నుండి పోటీ చేయదానికి మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఉత్సాహం చూపించారు. తెరాస అభ్యర్ధిగా దయాకర్ పేరును ఖరారు చేసినట్లు వార్తలు రాగానే, కాంగ్రెస్ సర్వేకి బదులు స్థానికంగా మంచి పలుకుబడి ఉన్న సిరిసిల్ల రాజయ్యను అభ్యర్ధిగా ఖరారు చేసింది.
ఆయన 2009 ఎన్నికలలో ఘనవిజయం సాధించారు కానీ 2014లో ఎన్నికలలో కడియం శ్రీహరి చేతిలో ఓడిపోయారు. తెరాస ప్రభుత్వం పట్ల రాష్ట్రంలో ప్రజలలో, ముఖ్యంగా రైతులలో నెలకొన్న వ్యతిరేకత కారణంగా ఈసారి రాజయ్య తప్పకుండా గెలుస్తారని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ఎన్నికలలో బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని తెదేపా నిశ్చయించుకొంది. కనుక తమ ఉమ్మడి అభ్యర్ధిని బీజేపీ ఇంకా ప్రకటించవలసి ఉంది. తెదేపా, బీజేపీలు కూడా అవే కారణాలతో తమ అభ్యర్ధి విజయం సాధిస్తారని భావిస్తున్నాయి. ఈ ఎన్నికలలో వైకాపా కూడా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించింది. అది కూడా ఇంకా తన అభ్యర్ధి పేరుని ఖరారు చేయవలసి ఉంది. వామపక్షాలు అన్నీ కలిసి స్వతంత్ర అభ్యర్ధిగా నిలబడుతున్న గాలి వినోద్ కి మద్దతు ఇస్తున్నాయి.