దాదాపు 3 వేల పాటలు రాశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. తన తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఆయన చివరి పాటలోనూ `సిరివెన్నెల` ప్రస్తావన రావడం.. యాధృచ్చికం అంటే మనసు ఒప్పుకోదు. అది విధి లీల. శ్యామ్ సింగరాయ్‌లో సిరివెన్నెల.. `సిరివెన్నెల` అనే పాట రాశారు. అది ఆయన ఆఖరి పాట. సిరివెన్నెల మరణించిన రెండో రోజున.. ఈ పాటని రికార్డ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాని ఆయనకే అంకితం కూడా ఇచ్చింది. సిరివెన్నెల రాసిన. ఆ సిరివెన్నెల పాట.. ఈరోజు విడుదలైంది.
”నెలరాజునీ..
ఇల రాణినీ
కలిపింది కదా..
సిరి వెన్నెల” అంటూ మొదలైన గీతమిది. అనురాగ్ కులకర్ణి చాలా భావయుక్తంగా పాడిన పాటకు.. మిక్కీ జేమేయర్ వినసొంపైన ట్యూన్ అందించారు. పాటలో చాలా చోట్ల.. సిరివెన్నెల మెరుస్తారు. ఆయనకే సాధ్యమయ్యే కొన్ని పంక్తులు మెప్పిస్తాయి.
”ఇది నింగికి
నేలకి
జరిగిన పరిచయమే”
”సంతోషం సరసన
సంకోచం మెరిసినా
ఆ రెంటికి మించిన
పరవశ లీలలు.. కాదని అనగలమా?” అంటూ అర్థవంతమైన పోలికలతో పాట హాయిగా సాగిపోయింది. నాని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి కథానాయికలు. ఈనెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.