తెలుగు సినిమా సంపాదించుకున్న అద్భుతమైన గీత రచయితల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఎన్నోసార్లు జాతీయ అవార్డు అంచుల వరకూ వెళ్లొచ్చారు. ఒక్కసారి కూడా ఆ అవార్డుని అందుకోలేదు. తెలుగు సినిమా పాటకు ఇప్పటి వరకూ మూడంటే మూడేసార్లు ఆ అవకాశం దక్కింది. శ్రీశ్రీ, వేటూరి, సుద్దాల అశోక్ తేజ పాటలకు మాత్రమే ఆ కీర్తి దక్కింది. అయితే.. తన సినీ కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాటల్ని అందించి – ‘ఈసారి జాతీయ అవార్డు రావడం ఖాయం’ అనుకున్న సందర్భాల్లోనూ సీతారామశాస్త్రికి మొండిచేయ్యే ఎదురైంది. ‘రుద్రవీణ’ సినిమాలో అన్ని పాటలూ ఆయనే రాశారు. తరలిరాద తనే వసంతం, నమ్మకు నమ్మకు ఈ రేయిని… పాటలు ఎంతో హృద్యంగా ఉంటాయి. ఆ పాటలకు జాతీయ అవార్డు గ్యారెంటీ అనుకున్నారు.. కానీ అప్పుడూ రాలేదు. అది మొదలు.. ప్రతీసారీ జాతీయ అవార్డులలో ఆయనకు నిరాశే మిగిలింది. అయితే ఈసారి జాతీయ అవార్డు పట్ల సీతారామశాస్త్రి గట్టి నమ్మకమే పెంచుకున్నారు. ‘సైరా’ కోసం తాను రాసిన టైటిల్ గీతానికి అవార్డు వస్తుందన్న ఆశాభావం వక్తం చేస్తున్నారు సిరివెన్నెల.
ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన ‘సైరా’ విజయోత్సవ కార్యక్రమంలో సీతారామ శాస్త్రి జాతీయ అవార్డుపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రుద్రవీణలో ఒక్క ఓటు తేడాతో జాతీయ అవార్డు తప్పిపోయిందని, ఈసారి సైరాకు పది ఓట్ల మెజార్టీతో జాతీయ అవార్డు రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సైరా’లో టైటిల్ సాంగ్‌కి మంచి స్పందన వస్తోంది. సినిమాలో కరెక్ట్ టైమ్‌లో ఆ పాట ప్లేస్ చేశారు. భావోద్వేగాలు కూడా బలంగా పండాయి. కాకపోతే.. ఇంతకంటే గొప్ప పాటలు సీతారామశాస్త్రి గతంలో ఎన్నో రాశారు. అందులో చాలా పాటలు.. మనో వికాస పాఠాలుగానూ మారాయి. వాటితో పోలిస్తే…. ‘సైరా’లో గీతం చిన్నదిగానే కనిపిస్తోంది. అప్పుడు రాని అవార్డు ఈసారి వస్తుందన్న భరోసా ఎందుకు కలిగిందో..? బహుశా ఓ దేశభక్తుడ్ని కీర్తిస్తూ రాసిన గీతం కాబట్టి.. శాస్త్రిగారు నమ్మకం పెట్టుకున్నారేమో..??