సినిమాల్లో పాటలకు అన్యాయం జరుగుతోందని సీనీ రచయితలు వాపోవడం చూస్తూనే ఉంటాం. అదేంటో వెరైటీగా ‘అసలు సినిమాల్లో పాటలెందుకు’ అనే కొత్త చర్చ లేవనెత్తారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. దాదాపు మూడు వేల పాటలు రాసి, తెలుగు పాటని శిఖరం ఎక్కించిన గీత రచయిత ఇలా అన్నారంటే ఆశ్చర్యపోవడం కాదు… ఆలోచించాలి.
సినిమాల్లో అసలు పాటలకు ఓ విలువ ఉందా? పాట కోసం జనాలు ఎదురుచూస్తున్నారా? పాటలతో సినిమాలు హిట్టయిన దాఖలాలు ఈ మధ్యన ఉన్నాయా? అసలు తెరపై కనిపిస్తున్న పాటలకు ఓ అర్థం అంటూ ఉందా? అనేది అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. పాట వస్తుందంటే… ‘ఇంకో ఇంట్రవెల్ వస్తుంది’ అనుకుని, సిగరెట్ కాల్చుకోవడానికో, ఫోన్లో మాట్లాడుకోవడానికో తుర్రుమనేవాళ్లని చాలామందినే చూస్తుంటాం. కథతో సంబంధం లేకుండా `కట్ చేస్తే పాట` అంటూ వచ్చే గీతాలు చాలానే కనిపిస్తుంటాయి. ఇలాంటి పాటల్ని అనవసరంగా చొప్పించే వాళ్లంతా ఒక్కసారి సీతారామశాస్త్రి మాటల్ని గుర్తు చేసుకుంటే మంచిది.
పాటంటే మామూలు విషయం కాదు. పాట రాయించాలి, రికార్డింగ్ చేయించాలి, అందమైన లొకేషన్లలో తెరకెక్కించాలి. సీతారామశాస్త్రి లెక్కల ప్రకారం `ఒక్కో పాటకు ఆరు లక్షల నుంచి ఆరు కోట్ల వరకూ ఖర్చవుతోంద`ట. నిజమే… స్టార్ హీరోల సినిమాల్లో పాటలంటే కోట్లతో వ్యవహారం. ఒక్క పాటని మినహాయించినా ఆరు కోట్లు నిర్మాతకు ఆదానే. పోనీ ఆ పాట వల్ల సినిమాకి వచ్చే అదనపు ప్రయోజనం ఉందా అంటే.. అదీ శూన్యమే. ఐటెమ్ గీతాల కోసం దర్శక నిర్మాతలు ఆపసోపాలూ పడిపోతుంటారు. ముంబై హీరోయిన్నో, విదేశీ సోయగాన్నో దిగుమతి చేస్తుంటారు. నిజంగా ఐటెమ్ పాటల వల్ల అంత మైలేజీ ఆ సినిమాకి వస్తుందా? అని ప్రశ్నించుకోగలిగితే అలాంటి పాటలూ ఆగిపోతాయి.
”పాటలపై అంతగా ఆసక్తి ఉంటే, పాటల్ని డిమాండ్ చేసే కథలనే ఎంచుకోండి” అనేది సిరివెన్నెల మాట. అసలు కథలే అత్తెసరు మార్కులతో వస్తున్నాయి. అవి పాటల్ని డిమాండ్ చేయడమేంటి?? ”హాలీవుడ్లో పాట మాయమైపోయింది. బాలీవుడ్లో పాట రీరికార్డింగ్‌లో కలిసిపోయింది. పాట వస్తుంటే జనాలు థియేటర్లోంచి లేచి వెళ్లిపోతున్నారు. అలాంటప్పుడు పాటలు చొప్పించాలన్న ప్రయత్నం ఎందుకు? ఆ మేర నిర్మాత ఖర్చు తగ్గించ వచ్చు కదా” అనేది సిరివెన్నెల సూటి ప్రశ్న. నిజంగా దర్శక నిర్మాతలు ఈ ప్రశ్నకు సమాధానం రాబట్టుకోగలిగితే ‘కట్ చేస్తే పాట’ అనే మాట ఇక నుంచి వినిపించదు.