దిగ్గజ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చనిపోయిన తరవాత.. ‘బాలూ గారుపాడిన చివరి పాట ఇదే.. మా సినిమాలోనే పాడారు’ అని చాలామంది నిర్మాతలు క్లైమ్ చేసుకోవాలని చూశారు. `చివరి పాట` ఉంటుంది గానీ, `చివరి పాటలు` అనేవి ఉండవు. బాలూనే స్వయంగా చెబితే తప్ప… ఆయన చివరి పాట ఏదన్న విషయంలో క్లారిటీ ఉండదు. కాబట్టి.. అది అసాధ్యం.
సీతారామశాస్త్రి చనిపోయిన తరవాత కూడా… ఇలాంటి సంకటమే వచ్చింది. ‘సీతారామశాస్త్రి గారు రాసిన చివరి పాట ఇదే’ అంటూ చాలామంది దర్శక నిర్మాతలు చెప్పుకుంటున్నారు. ‘ఇదే చివరి పాట’ అనుకుంటూ చాలా చివరి పాటలు బయటకు వచ్చేశాయి. కరోనా టైమ్లో.. షూటింగులు వాయిదా పడడంతో, సినిమాలూ ఆగిపోయాయి. రిలీజ్లు ఆలస్యమయ్యాయి. కాబట్టి.. అప్పుడెప్పుడో ఆయన రాసిన పాటలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ‘రంగమార్తండ’లోనూ ఆయన ఓ పాట రాశారు. ‘సీతారామం’లోనూ ఆయన రాసిన పాట బయటకు వచ్చింది. అదృష్టం ఏమిటంటే.. ఈ రెండు సినిమాలూ ‘ఇది శాస్త్రి గారు రాసిన ఆఖరి పాట’ అని చెప్పుకోకపోవడం.
అంత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే.. సిరివెన్నెల తన చివరి పాట.. సినిమా కోసం రాయలేదు. తన అర్థాంగి కోసం రాశారు. ఆసుపత్రి పడకపై.. సిరివెన్నెల తన భార్యకు కానుకగా ఓ పాట రాశారని, అయితే…. ఆ పాటలోని పల్లవి మాత్రమే పూర్తయ్యిందని, పల్లవితోనే ఆ పాటని సరిపెట్టాల్సివచ్చిందని తెలుస్తోంది. సో.. శాస్త్రి చివరి పాట ఇదని.. క్లైమ్ చేసుకొనే అధికారం, అవకాశం.. సీతారామశాస్త్రి అర్థాంగికే ఉందన్నమాట.