ఢిల్లీ లిక్కర్ స్కాం చుట్టూ ఇప్పుడు దేశ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ స్కాం కేసులో ఢిల్లీ కోర్టులో సీబీఐ తొలి చార్జిషీటు దాఖలు చేసింది. అందులో కీలకమైన నేరస్తులుగా ఇప్పటి వరకూ ప్రచారంలో ఉన్న వారి పేర్లు మిస్సయ్యాయి. అందులో మొదటిది .. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాదే. ఆయన కింగ్ పిన్ అని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ-వన్ ఆయనే. కానీ చార్జిషీటులో ఆయన పేరు లేదు. ఆయనదే కాదు జైల్లో ఉన్న అరబిందో డైరక్టర్ శరత్ చంద్రారెడ్డి పేరు కూడా లేదు. మొత్తం 10 వేల పేజీలతో సీబీఐ చార్జ్ షీట్ రూపొందించింది
చార్జిషీట్లో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉండగా.. అయిదుగురు ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు. ఈ ఏడుగురిలో అభిషేక్ బోయినపల్లి, ముత్తా గౌతమ్ , అరుణ్ రామచంద్ర పిళ్లైలలకు తెలంగాణ లింకులున్నాయి. ముత్తా గౌతమ్ ఆంధ్రప్రభ పేపర్, ఇండియా ఎఫెడ్ న్యూస్ చానల్ యజమాని. సిసోడియా దగ్గరి అనుచరుడైన దినేష్ అరోరాను సీబీఐ ఇప్పటికే అప్రూవర్‌గా మార్చింది. ఇందుకు కోర్టు కూడా అంగీకరించింది. దినేశ్ విచారణకు పూర్తిగా సహకరించారని, కేసుకు సంబంధించి కీలక సమాచారం ఇచ్చారని సీబీఐ కోర్టుకు తెలిపింది. అయినప్పటికీ సిసోడియాపేరును చార్జిషీట్లో చేర్చలేదు.
ఇదే కేసులో ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. అరబిందో డైరక్టర్ శరత చంద్రారెడ్డిని అరెస్ట్ చేసింది సీబీఐ కాదు. ఈడీనే అరెస్ట్ చేసింది. అయితే సీబీఐ చార్జిషీటులో పేరు లేకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈడీ చార్జిషీట్‌పై పడింది. రెండు , మూడు రోజుల్లో ఈడీ కూడా.. చార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ కేసు.. పూర్తిగా అవినీతి కోణంలో ఉంటుంది.. ఈడీ కేసు మాత్రం మనీలాంరింగ్.. అక్రమ నదదు చెలామణి కోణంలో ఉంటుంది.