తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. రాజకీయాలకు అతీతంగా వేగంగా దర్యాప్తు చేసి నిజాలను బయట పెట్టి ఉద్యోగార్థుల్లో నమ్మకం పెంచాల్సిన సిట్ .. రాజకీయ నేతలను టార్గెట్ చేసుకోవడంతో సీరియస్ నెస్ తగ్గిపోతోంది. ఏపీ పోలీసుల మాదిరిగా ఆరోపణలు చేసిన రాజకీయ నేతలకు ఆధారాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేస్తోంది. ఇటీవల రేవంత్ రెడ్డి కేటీఆర్ పీఏ తిరుపతి వ్యవహారంపై ఆరోపణలు గుప్పించారు. ఇదంతా కేటీఆర్ కనుసన్నల్లో జరిగిందన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కావాలంటూ.. సిట్ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.
అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా నోటీసులు రాలేదని.. నోటీసులు అందుకున్న ఆధారాలు ఇచ్చేది లేదని ప్రకటించారు. సిట్టింగ్ జడ్జితోనే విచారణ చేయిస్తే ఇస్తామన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు అండగా ఉంటామని TSPSC పేపర్ లీకేజ్ బాగోతం బయటపడాలంటే సిట్టింగ్ జడ్జ్ తోనే విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ గద్దె దిగేదాక మా పోరాటం కొనసాగుతుందన్నారు. కేసును కావాలనే నీరుగారుస్తున్నారని ఆరోపిస్తున్నారు. బండి సంజయ్ కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయనకు నోటీసులు ఇచ్చినా దుామారం రేగే అవకాశం ఉంది.
విచారణ జరిపే కొద్దీ అసలు లీక్ కాని పరీక్ష పేపర్ ఏదైనా ఉందా అనే డౌట్ అందరికీ వస్తోంది. ఇలాంటి సమయంలో పోలీసులు, దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి నిజాలను వెల్లడించాల్సి ఉంది. నిజాయితీగా కష్టపడిన నిరుద్యోగులకు న్యాయం చేయాల్సి ఉంది. అలా కాకుండా రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్న వారి విషయంలో జోక్యం చేసుకుని నోటీసులు జారీ ేచస్తే… విషయం అంతా రాజకీయం అవుతుంది. నిరుద్యోగులు అన్యాయమైపోతారు.