రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోక .. అధికారాన్ని మళితం చేస్తే రచ్చ అయిపోతుంది. ఏపీలో జరిగుతోంది ఇదే. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలూ అదే చేస్తున్నారు. టీడీపీ నేతలు రాజకీయ ఆరోపణలు చేస్తే ఆధారాలివ్వాలని టీడీపీ నేతల్ని పోలీసులు అడిగేవారు. ఆధారాలు మేమిచ్చేదానికి మీరెందుకు .. అని టీడీపీ నేతలు రివర్స్‌లో విమర్శించేవారు. దాంతో పోలీసు వ్యవస్థ పై ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణ అధికార పార్టీ నేతలు ఆ అనుభవాల్ని పట్టించుకోకుండా ప్రతిపక్ష నేతల్ని బెదిరించగలం అని సిట్‌తో నోటీసులు ఇప్పిపిస్తున్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకేసులో అటు రేవంత్ రెడ్డి ఇటు బండి సంజయ్ ఆరోపణల తీవ్రత పెంచారు. రాజకీయానికి అధికారవర్గానికి చాలా స్పష్టమైన తేడా ఉంటుంది. రాజకీయ నేతలు ఎన్ని ఆరోపణలు చేసుకుంటారో లెక్క పెట్టాల్సిన పని లేదు. కానీ ఈ ఆరోపణల్లో అధికారవర్గాలు జోక్యం చేసుకుంటే గందరగోళం ఏర్పడుతుంది. పేపర్ల లీకేజీ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలకు ఆధారాలు కావాలని సిట్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఇంటికి ఆ నోటీసుల్ని అంటించింది. ఇరవై మూడో తేదీన తమ ఎదుటకు హాజరు కావాలని ఆదేశించింది. నిజానికి అలాంటి వ్యాఖ్యలు బండి సంజయ్ కూడా చేశారు. ఆయనకు ఈ నోటీసులు ఇవ్వలేదు. ఇస్తామని చెబుతున్నారు. కానీ బండి సంజయ్ ముందుగానే తనకు నోటీసులు ఇచ్చే దమ్ముందా అని సవాల్ చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి తనకు నోటీసులు ఇచ్చారు సరే.. దర్యాప్తుకు సంబంధించిన కీలకమైన విషయాలు చెప్పిన కేటీఆర్‌కూ నోటీసులు ఇవ్వాలని లేకపోతే హైకోర్టుకు వెళ్తానని ప్రకటించారు. ఇప్పుడు అటు రేవంత్ కానీ ఇటు సంజయ్ కానీ ఎదురు దాడి చేస్తోంది ప్రభుత్వం మీద కాదు.. సిట్ అధికారులపైనే. అయితే ఈ ఆరోపణలు ఎదుర్కోవడానికా అన్నట్లుగా సిట్ అధికారులు రాజకీయంలో జోక్యం చేసుకోడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు సిట్ ను వేసిందే ఈ కేసును నిర్వీర్యం చేయడానికని విపక్షాలు ఆరోపణలు అందుకుంటున్నాయి.