డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించి అనేక విమర్శలూ ప్రతి విమర్శలూ వచ్చాయి. ఈ విషయమై చార్మి వేసిన కేసులోనూ ఇతర సినిమా వారికి సలహాలివ్వడంలోనూ ముఖ్య పాత్ర వహించిన బిజెపి నాయకుడు న్యాయవాది రఘునందన్ రావు ఆసక్తికరమైన మరో విషయం చెబుతున్నారు. దర్శకుడు పూరీజగన్నాథ్ను సిట్ అధికారులు అడిగిన మొదటి ప్రశ్న పవన్ కళ్యాణ్ నటించిన కెమెరా మెన్గంగతో రాంబాబు సినిమాపైనట. ఆ సినిమా ఎందుకు తీశారు? ఎవరు వెనకున్నారు? పవన్ కళ్యాణ్ణే ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారట. గతంలో పవర్స్టార్కూ తెలంగాణ పాలక కుటుంబానికి మధ్యలో నడిచిన వివాదాల నేపథ్యంలో పూరీపై ఒత్తిడి పెంచేందుకే ఈ ప్రశ్నలు వేశారు తప్ప ఆ చిత్రానికి డ్రగ్స్ కేసుకు సంబంధం ఏమిటని రఘు నందన్ రావు నాతో ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న వేశారు. ఇలాటి కొన్ని అంశాలు పూరీ కూడా చెప్పి వున్నా రాజకీయ కోణం ఆపాదించడం ఇక్కడ విశేషం. ఈ తరహాలోనే మరికొన్ని ప్రశ్నలు కూడా నడిచాయట. తమాషా ఏమంటే తర్వాత రాజ్భవన్లో మాత్రం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రికెటిఆర్ కూడా బాగా మాట్లాడ్డం కూడా అందరూ గమనించారు. ఇప్పటికే న్యాయస్థానాలలోనూ, మీడియాలోనూ కూడా సిట్పైన ప్రత్యేకంగా అకున్ సబర్వాల్పైన ధ్వజమెత్తిన రఘు ఆరోపణలకు మరోసారి వారు స్పందిస్తారా అలా జరిగితే ఏం చెబుతారన్నది వేచి చూడాల్సిన విషయం.