తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన వ్యవహారాలపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం మొదట..మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుపైనే గురి పెట్టింది. ఆయన బినామీలంటూ… ఆయన వియ్యంకుడితో పాటు.. విజయవాడకు చెందిన ఓ బిల్డర్.. మరో చిన్న స్థాయి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో సోదాలు చేశారు. అమరావతిలో బినామీ లావాదేవీలు జరిగాయని… ప్రత్తిపాటి పుల్లారావు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని ప్రభుత్వం నమ్ముతోంది. ఈ మేరకు సిట్ మొదట ఆయనపైనే గురి పెట్టింది. ఆయన వియ్యంకుడి ఇంట్లో సోదాలు చేశారు. విజయవాడలో పటమటలంకలో ఉండే ఓ బిల్డర్ నివాసంలో .. తర్వాత కార్యాలయంలో సోదాలు చేశారు.
పుల్లారావుకు బినామీగా భూములు కొనుగోలు చేశారా.. అని సిట్ ప్రశ్నించడంతో.. ఆయన తాను కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు, తన ఆదాయ వివరాలను సిట్ అధికారులకు చూపించారు. తానెవరికీ బినామీ కాదని.. స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. తర్వాత ఓ చిన్న స్థాయి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లోనూ సోదాలు చేశారు. ఆయన రాజధాని ప్రాంతంలో కాకుండా ఇతర చోట్ల.. 100 నుంచి 150 గజాలు కొనుగోలు, అమ్మకాలు జరిపిన లావాదేవీలను గుర్తించారు. దీనిపై సిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన మరికొంతమంది నేతల గృహాల్లో కూడా త్వరలోనే సోదాలు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారి వివరాలతోపాటు బినామీగా ఎవరైన ఉండి భూములు కొనుగోలు చేశారా అనే అంశంపై కూడా ఆరాతీసి సమాచారాన్ని సేకరిస్తున్నారు. కొద్ది రోజుల కిందట.. బెదిరించి .. భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణలపై.. సీఐడీ అధికారులు నారాయణ, పుల్లారావుపై కేసులు నమోదు చేశారు. ఆ కేసు వివరాలను సిట్ తీసుకుంది. తనిఖీల్లో ఎక్కడైనా ఆధారాలు లభ్యమైతే కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది.