కర్ణాటకలో రమేష్ జార్కిహోళి అనే మంత్రి ఉద్యోగం పేరుతో ఓ అమ్మాయిని లొంగదీసుకుని చేసిన రాసలీలల వీడియో రేపిన దుమారం అంతా ఇంతా కాదు. చివరికి ఆయన పదవి ఊడింది. అప్పట్లోనే ఈ వీడియోపై బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ కమిటీ నివేదిక రెడీ చేసింది. ఆ దర్యాప్తు బృందానికి ఎంత వెదికినా వీడియోలో రమేష్ జార్కిహోళి కన్పించలేదట.
అందుకే ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. జర్ఖిహోళి అందులో ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని నిర్మోహమాటంగా చెప్పింది. కేసును మూసివేసేందుకు కోర్టుకు నివేదికను సమర్పించింది. నిజానికి తను ఆ వీడియో లో ఉన్నట్లుగా.. ఆ యువతి తనను ట్రాప్ చేసిందన్నట్లుగా పలుమార్లు రమేష్ జార్కిహోళి మాట్లాడారు. కుట్ర జరిగిందన్నారు. ఆ తర్వాత ఎలాగోలా కేసు పెట్టిన మహిళతో సెటిల్మెంట్ చేసుకుననారు. జర్కిహోళిపై కేసును ఉపసంహరించుకోవాలని సామాజిక కార్యకర్త నిర్ణయించుకున్నారు.
ఇప్పుడు అంతా సద్దుమణిగిపోయిన తర్వాత ఆ వీడియోలో జార్కిహోళి కనిపించలేదని తేల్చారు. మరెవరు ఉన్నారు.. తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకుంటారా అన్నదానిపై స్పష్టత లేదు. అడ్డంగా దొరికినా బీజేపీ నేతలను కాపాడటానికి దర్యాప్తు సంస్థలు అవసరమైన వాటినే చూసి.. తమకు అవసరం లేని వాటిని చూడవని మరోసారి తేలిపోయిందన్న విమర్శలు ఈ దర్యాప్తును చూసి రాకుండా ఉంటాయా?