ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఎంత దూకుడుగా వెళ్తే.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అంత దూకుడు చూపిస్తోంది. తాజాగా భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈనెల 21న హాజరు కావాలని సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ లోని సిట్ కార్యాలయంలో ఈనెల 21న ఉ.10.30గం. హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరు కాకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. బీఎల్ సంతోషల్ బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. బీజేపీలో ఏం జరగాలన్నా ఆయన చేతుల మీదుగానే జరుగుతూంటాయని చెబుతూంటారు. ఇప్పుడు నేరుగా ఆయనకే సిట్ గురి పెట్టింది.
కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి చేసిన ఆరోపణల్లో బీఎల్ సంతోష్ కూడా కీలకం. అలాగే కేరళకు చెందిన తుషార్ అనే వ్యక్తి కూడా ఈ రాకెట్లో సూత్రధారి అని కేసీఆర్ చెప్పారు. ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారు. సింహయాజీకి ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేశారంటూ కరీంనగర్‌కు చెందిన ఓ లాయర్‌కు కూడా 21వ తేదీన విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మొత్తంగా కీలకంగా భావిస్తున్న వారందరికీ 21వ తేదీనే హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. లేకపోతే వారందర్నీ అరెస్ట్ చేస్తామని సిట్ చెబుతోంది.
ఇటీవల కేసీఆర్ కేంద్రానికే కాదు.. తమకూ దర్యాప్తు సంస్థలు ఉన్నాయని ప్రకటించారు. ఆ ప్రకారం ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఎంత దూకుడుగా వెళ్తే.. సిట్ కూడా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అంతే దూకుడుగా వెళ్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీఎల్ సంతోష్‌కు నోటీసులు ఇవ్వడం అంటే.. బీజేపీ అగ్రనాయకత్వం సీరియస్‌గా తీసుకుంటుందని.. భావిస్తున్నారు. ఈ కేసులో కేసీఆర్ బయట పెట్టిన ఆడియో, వీడియోలు తప్ప.. వేరే ఆధారాలు లేవు. కనీసం డబ్బులు కూడా పట్టుకున్నట్లుగా చెప్పలేదు. అందుకే ఎవరెవరో మాట్లాడుకున్నారని.. బీఎల్ సంతోష్ లాంటి బీజేపీ ముఖ్యులకు నోటీసులు జారీ చేస్తే ఎలా వర్కవుట్ అవుతందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ముందు ముందు ఈ కేసులో బలం ఉంటే … వాళ్లని అరెస్ట్ చేయగలిగితే బీజేపీపై కేసీఆర్ పోరాటం బలంగా జరిగే చాన్స్ ఉంది. ఈ కేసు తేలిపోతే.. బీజేపీ ఎదురుదాడికి టీఆర్ఎస్ బాగా ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు.