వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకా హత్య జరిగి చాలా కాలం అయింది. ఆ హత్యపై ఎన్నో అనుమానాలున్నాయి. పక్కాగా సాక్ష్యాలు దొరికిన హత్యగా.. పోలీసు వర్గాలు సైతం నిర్ధారించిన కేసు అది. కానీ.. పోలీసులు ఆ కేసును చేధించలేకపోతున్నారు. ఇప్పటికీ.. వాళ్లనూ.. వీళ్లనూ.. విచారణ చేస్తూ.. సమయం గడిపేస్తున్నారు. తాజాగా.. కడప పోలీసులు మరోసారి మీడియాకు సమాచారం ఇచ్చారు. వైఎస్ జగన్ బంధువులతో పాటు.. మరికొంత మందిని రహస్య ప్రదేశంలో ప్రశ్నించామని ఆ సమాచారం సారాంశం.
ఇన్నాళ్లు సైలెన్స్..! ఇప్పుడెందుకు తెరపైకి..!?
జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో శాంతిభద్రతలు అత్యంత ఘోరంగా ఉన్నాయన్న విషయాన్ని చెప్పేందుకు… విపక్ష పార్టీలు ప్రధానంగా వాడుకుంటున్న విషయం.. వైఎస్ వివేకా హత్య కేసు. సొంత బాబాయిని చంపిన హంతకుల్ని పట్టుకోవడం.. చేత కాలేదని.. మొన్న కడప పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. నిన్న వెళ్లినపవన్ కల్యాణ్.. గట్టిగానే దెప్పిపొడిచారు. ఆరు నెలల పాలన విశ్లేషణల్లోనూ… పోలీసులు ఈ కేసు చేధించలేనంతగా నిర్వీర్యమైపోయారా.. అన్న చర్చలు నడిచారు. ఆరు నెలలు గడిచిపోయినా… ఒక్క అడుగు కూడా విచారణలో ముందుకు పడలేదు. విమర్శలు ప్రారంభమవడం.. ప్రజల్లోనూ.. అనుమానాలు బలపడుతూండటంతో.. పోలీసులు మరో సారి విచారణ పేరుతో.. హడావుడి ప్రారంభించారని అంటున్నారు.
సాక్ష్యాలు తుడిపేసిన వారికి జరిగిందేమిటో తెలియదా..?
వైఎస్ వివేకా హత్యను.. మొదట కుటుంబసభ్యులు ఆత్మహత్యగా ప్రచారం చేశారు. జగన్ మీడియా కూడా అదే చెప్పింది. చివరికి పోలీసులు పోస్టుమార్టంకు పంపిన తర్వాత … ఫోటోలు బయటకు రావడంతో… హత్యగా చెప్పడం ప్రారంభించారు. అప్పటికే వైఎస్ కుటుంబీకులు… సాక్ష్యాలను తారుమారు చేశారు. డాక్టర్ అయిన వైఎస్ జగన్ భార్య భారతి తండ్రి శవానికి కుట్లేశారు. ఇలా కేసులో అనేక లాజిక్కులు… కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకు ఉపయోగపడతాయి. కానీ పోలీసులు మాత్రం… విచారణ ఏ కోణంలో జరిగితే ముందుకు సాగదో.. ఆ కోణంలోనే విచారిస్తున్నారన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.
ఇప్పుడైనా… ప్రజలకు నిజాలు చెబుతారా..?
వైఎస్ వివేకా హత్య కేసులో… మొదట సీబీఐకి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్లు వేశారు. తాను సీఎం అయిన తర్వాత… అలాంటి యోచన చేయడం లేదు. అంతే కాదు.. తన అధీనంలో ఉన్న పోలీసులతోనూ పూర్తి స్థాయిలో విచారణ చేయించలేకపోతున్నారు. విమర్శలు వచ్చినప్పుడల్లా.. వాళ్లకీ.. వీళ్లకీ లైడిటెక్టర్ పరీక్షలని.. విచారణలని.. హడావుడి చేస్తున్నారు. వివేకా హత్యపై.. ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి. వాటిని బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. లేకపోతే వారి సామర్థ్యం, నిజాయితీపై అనుమానాలు అంతకంతకూ పెరిగిపోతాయి.