తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో జరిగిన కల్తీ వ్యవహారాల్లో పూర్తి స్థాయి అక్రమాలను బయట పెట్టడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఒక్క నెయ్యి విషయంలోనే కాకుండా మొత్తం ప్రసాదాల కోసం వినియోగించే వస్తువుల టెండర్లు పొందిన వారు.. వారు సరఫరా చేసిన సరుకుల నాణ్యత మొత్తాన్ని సిట్ సమీక్షించే అవకాశం ఉంది. సిట్ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు.
ఈ అంశంపై తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. టెండర్ల పేరుతో తమకు కావాల్సిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఎంత అడ్డగోలుగా నిబంధనలు మార్చారో వివరించారు. వాటికి సంబంధించిన పత్రాలను బయట పెట్టారు. కనీస అనుభవం లేకపోయినా… ఆ సామర్థ్యం మేరకు టర్నోవర్ లేకపోయినా సరే కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు దాదాపుగా అన్ని నిబంధనలు మార్చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కమిషన్లకు అలవాటు పడి ఆలయాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు.
అన్యమతస్తుల చేతుల్లోనే ఐదేళ్ల పాటు ఆలయం ఉందన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి తన కుమార్తె పెళ్లిని క్రిస్టియన్ పద్దతిలో చేశారని.. సుబ్బారెడ్డి భార్య ఎప్పుడూ తన చేతుల్లో బైబిల్ ఉంచుకుని తిరుగుతారన్నారు. అలాంటి వారు టీటీడీ ఔన్నత్యాన్ని ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరి లెక్కలు దేవుడు తేల్చేస్తారని హెచ్చరించారు. సిట్ ఏర్పాటు నిర్ణయాన్ని చంద్రబాబు ప్రకటించడంతో ఇక మొత్తం వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.