ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీని నిండా ముంచేయాలనుకుంటున్న టీఆర్ఎస్కు… ఆ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌కు.. పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా కనిపించడం లేదు. రోజు రోజుకు కేసు వీక్ అయిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా బీఎల్ సంతోష్, తుషార్, జగ్గూ స్వామి అనే ముగ్గుర్ని నిందితులుగా చేర్చాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఫామ్ హౌస్ కేసు నమోదు చేసినప్పుడు ఈ ముగ్గురి పేర్లు ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించలేదు. తర్వాత వారికి నోటీసులు జారీ చేశారు. వారు తమ పేర్లు ఎఫ్ఐఆర్లో లేకుండా నోటీసులు జారీ చేయడం కరెక్ట్ కాదని వారు కోర్టులో రిలీఫ్ తెచ్చుకున్నారు.
దీంతో సిట్ పోలీసులు వ్యూహాత్మకంగా వెంటనే.. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గూస్వామిలను నిందితులగా చేర్చాలన్నారు. కానీ మెమోను కోర్టు తిరస్కరించింది. ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాలని.. ఆ ముగ్గుర్ని నిందితులుగా చేర్చలేరని తేలిపింది. దీంతో పోలీసుల ప్రయత్నం ఫెయిలయింది. మరో వైపు హైకోర్టులో కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇచ్చిన స్టేను ఎత్తి వేయించలేకపోతున్నారు. తమకేం సంబంధం లేదని వారి లాయర్లు గట్టిగా వాదిస్తున్నారు.
వారి పాత్ర ఉందని చెప్పడానికి బలమైన సాక్ష్యాలను సిట్ హైకోర్టుకు సమర్పించలేకపోతోంది. అసలు కేసును సీబీఐకి ఇవ్వాలని జగ్గూ స్వామి వేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. ఇక్కడా సిట్ తరపున వాదించడానికి ఢిల్లీ లాయర్లను తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నారు. తేడా వస్తే.. మొత్తం కేసు చేజారిపోతుంది. సీన్ రివర్స్ అయిపోతుందన్న ఆందోళన టీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది.