తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదానికి ఉపయోగించే నెయ్యి విషయంలో జరిగిన కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీబీఐ, సిట్, fssai అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అప్పటికే ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ ఆపేసింది. దాంతో కొత్త సిట్ ను వెంటనే నియమిస్తారని .. విచారణ ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ సిట్ నియామకంపై ఇంత వరకూ అధికారిక ప్రకటన రాలేదు.
సిట్ నియామకం, విచారణపై సుప్రీంకోర్టు ఎలాంటి గడువు పెట్టకపోవడంతో నింపాదిగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టుకు దసరా సెలవులు అయ్యేలోపు నియమించే అవకాశం ఉంది. సీబీఐ చీఫ్ దర్యాప్తును పర్యవేక్షిస్తారు. ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు ఏపీలోని సిట్ బృందంలో ఉన్న వారు.. ఒక fssai అధికారిని ఖరారు చేయాల్సి ఉంది. వీరిని ప్రకటిస్తే.. దర్యాప్తు వేగంగా జరిగే అవకాశం ఉంది. ఒక వేళ సిట్ ఏర్పాటులో ఆలస్యం అయితే కేసు షెడ్డుకెళ్లే అవకాశం ఉంది.
కల్తీ నెయ్యి వ్యవహారంలో పెద్ద కుట్ర జరిగిదంని ఇప్పటి వరకూ బయటకు వచ్చిన ఆధారాలు నిరూపించాయి. అవినీతి కోసం అలా చేశారా లేకపోతే హిందూ ధర్మంపై దాడికి ప్రణాళికాబద్దంగా అలాంటి ప్రయత్నం చేశారా అన్ని సిట్ దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఏం తేలినా శ్రీవారిపై కానీ.. ఆలయంపై కానీ ఎలాంటి మచ్చా పడదు. కానీ ఆ తప్పు చేసిన వారికి మాత్రం శిక్ష పడటం ఖాయం అనుకోవచ్చు.