తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించడంలో దూకుడు చూపిస్తున్నారు. ఆ బృందాల పనితీరు ఎలాఉందో .. అవేం చేస్తున్నాయో ఎవరికీ తెలియదు కానీ.. మరో సిట్ ను నియమించారు. ఈ సారి వల్లభనేని వంశీ చేసిన అక్రమాలపై సిట్ ను నియమిస్తూ ఉత్త్రవులు జారీ చేశారు. ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ..మరో ఇద్దరు కిషోర్లను ఈ సిట్ లో చేర్చారు.
గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ చేయని అక్రమం లేదని నియోజకవర్గంలో సామాన్య ప్రజలు , రాజకీయ నేతలు చెబుతారు.ఆయన అక్రమాలు వైసీపీలో ఉన్నప్పుడే కాదు.. టీడీపీలో ఉన్నప్పుడు కూడా సాగాయి. అందుకే వైసీపీ రాగానే కేసులు పెడతారన్న భయంతో వైసీపీలో చేరి అక్కడ వాళ్లు చెప్పినట్లుగా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత వెంటనే విజిలెన్స్ తో పాటు వివిధ అక్రమాలపై విచారణ జరిపించారు. ప్రధానంగా గుట్టలను తవ్వేయడంతో పాటు మైనింగ్ అక్రమ రవాణాపై విజిలెన్స్ రిపోర్టులు రెడీ చేసింది. అయితే కేసులు పెట్టలేదు.
ఇప్పుడు సిట్ ద్వారా చర్యలు తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే అరెస్టు అయి జైల్లో ఉన్న వంశీకి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ ముందస్తు బెయిల్ రాలేదు. అయితే ప్రభుత్వం ఇప్పటికి ఎన్ని సిట్లు వేసిందో లెక్కే లేదు. రఘురామపై దాడి కేసు దగ్గర నుంచి మద్యం స్కాం వరకూ ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించారు. ఎందులోనూ పురోగతి విషయం బయటకు తెలియడం లేదు.