జడ్‌ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు, చెప్పులు పడ్డాయి. ఇదేం భద్రత అని మీడియా ప్రశ్నిస్తే.. డీజీపీ సవాంగ్.. తమకు చంద్రబాబు అన్యాయం చేశారని.. రాళ్లు, చెప్పులు విసిరిన వాళ్లు చెప్పారని.. చెప్పుకొచ్చారు. డీజీపీ సవాంగ్ వాదనపై… దేశవ్యాప్తంగా.. ఆశ్చర్యం వ్యక్తమయింది. రేపు ఎవరైనా.. ఎవర్నైనా హత్య చేసి.. తనకు అన్యాయం చేశారనే వాదన వినిపిస్తే.. డీజీపీ సవాంగ్ వదిలేస్తారా.. అన్న ప్రశ్నలు బయలుదేరాయి. డీజీపీ మాటలు..చంద్రబాబుపై దాడి ఘటనలు ఏపీలో తగ్గిపోయిన శాంతిభద్రతలకు సాక్ష్యంగా చూపిస్తూ… తెలుగుదేశం పార్టీ నేతలు..ఈ విషయాన్ని ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. మొత్తం ఘటన వివరాలు.. డీజీపీ మాటలను వివరిస్తూ.. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి… టీడీపీ ఏపీ అధ్యక్షుడుకళా వెంకటరావు లేఖ రాశారు. టీడీపీ సభ్యులు.. పార్లమెంట్లో ప్రస్తావించడానికి సిద్ధమయ్యారు.
వ్యవహారం సీరియస్‌గా మారుతూండటం.. డీజీపీ వ్యవహారం.. వివాదాస్పదం కావడం ఖాయమవుతూండటంతో.. ఏపీ సర్కార్ హడావుడిగా స్పందించింది. చంద్రబాబు అమరావతి పర్యటనలో దాడులకు పాల్పడిన ఘటనలపై ప్రత్యేక విచారణ బృందాన్ని నియమిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. గుంటూరు రూరల్ అడిషనల్ ఎస్పీ సిట్ బృందానికి ఇంచార్జ్‌గా వ్యవహరిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. బాపయ్య, సందీప్ అనే ఇద్దర్ని.. చెప్పులు, రాళ్లు వేసిన కేసులో అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబుపై దాడి జరిగేలా.. పోలీసులు భద్రతలో ఆలసత్వం వహించాలన్న ఆరోపణలపైనా సిట్ దర్యాప్తు చేస్తుంది.
నిజానికి చంద్రబాబు పర్యటన ప్రారంభం కావడానికి ముందు నుంచీ… వైసీపీ నేతలు.. అడ్డుకుంటామనే ప్రకటనలు చేశారు. చంద్రబాబు పర్యటనలో నిరసన కోసం.. వైసీపీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుంది. తెనాలితో పాటు… చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి నిరసనల కోసం వైసీపీ కార్యకర్తల్ని తీసుకొచ్చారు. పోలీసులు ఇవన్నీ తెలిసి కూడా.. సీడ్ యాక్సెస్ రోడ్ వద్దకు చంద్రబాబు బస్ రాగానే.. వారిని వదిలారు. మొత్తం కుట్రకోణం ఉందని.. స్పష్టంగా బయటపడుతున్నా..డీజీపీ అది నిరసనలో భాగం అని వ్యాఖ్యానించడంతో.. వైసీపీ కార్యకర్తలకు ధైర్యం ఇచ్చినట్లయింది. పోలీసుల తీరుపై టీడీపీ ఫిర్యాదులకు సిద్ధమయ్యేసరికి.. రికార్డుల కోసమైనా.. చెప్పుకోవడానికి ఉంటుందని.. సిట్ వేశారని.. టీడీపీ నేతలు అంటున్నారు.