పురాణ పాత్రల్ని, పేర్లనీ, వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా కొట్టినా – మత సంఘాల నుంచి విమర్శల్ని ఎదుర్కోవాల్సివస్తుంది. సినిమా విడుదలకు ముందు అనుకోని అవాంతరాలని ఎదుర్కోవాల్సివుంటుంది. ప్రస్తుతం ‘సీత’ కూడా అలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది. తేజ దర్శకత్వం వహించిన సినిమా ‘సీత’. కాజల్ ప్రధాన పాత్ర పోషించింది. శుక్రవారం విడుదల అవుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలకు స్పీడ్ బ్రేకర్లు పడ్డాయి.
సీత సినిమాలోని కొన్ని డైలాగులు, సన్నివేశాలు పురాణాల్ని, హిందూ మతాన్ని కించపరిచేలా ఉందని బీజేవైఎమ్ సంస్థ ఆరోపిస్తోంది. హిందూమతాన్ని, సంప్రదాయాల్ని ప్రచారం చేసే బీజేవైఎమ్.. ‘సీత’పై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సినిమాని నిషేధించాలని డిమాండ్ చేస్తోంది. ఈ సినిమా విడుదల కాకుండా అడ్డుకొనేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందుకు సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కోరుకుంటోంది. సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చాక.. ఓ సినిమాని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. `సీత` విడుదల విషయంలో ఎలాంటి అడ్డంకులూ ఎదురుకాకపోవొచ్చు. కానీ… ఇలాంటి వివాదాలు చిత్రబృందానికి కొత్త తలనొప్పులు తీసుకొస్తాయి. ‘సీత’ ట్రైలర్లోనే సీతగా కాజల్ పాత్రని చెప్పే ప్రయత్నం చేశారు తేజ. డబ్బుల కోసం పడక కూడా పంచుకోవడానికి సిద్ధపడే అమ్మాయిగా కాజల్ పాత్రని తీర్చిదిద్దారు. ఆ పాత్రకు సీత అనే పేరు పెట్టడమే ఇబ్బందిగా మారింది. ఇప్పటికిప్పుడు టైటిల్ మార్చడం కుదరని పని. సినిమాలో కాజల్ పేరు మార్చడం అంతకంటే కష్టం. మరి దీనిపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.