తెలుగు360 రేటింగ్: 2.25/5
హీరో అనగా హీరోయిన్ ప్రేమించుట..విలన్ అనగా హీరోయిన్ ను కామించుట కామన్. అనివార్యమగు ఈ పాయింట్ నుంచి తెలుగు సినిమాను ఎవ్వరూ దూరం చేయలేరు. అలాంటి పాయింట్ తో వచ్చిన మరో సినిమా సీత.
మూడు పాత్రలు. స్వాతిముత్యం లాంటి హీరో. యారోగెన్సీ ని నరనరాల నింపేసుకున్న హీరోయిన్. ఆ హీరోయిన్ ను ఎలాగైనా పక్కలోకి లాక్కోవాలనుకునే విలన్. వీటి మధ్య నడిచిన కథ..సారీ నడిచిన కాదు. నడిపిన కథ.
సినిమాకు లాజిక్కులు అక్కరలేదు అన్నది కాస్త నిజమే కానీ, మరీ రెండు బుల్లెట్లు తగిలిన తరువాత గంటల సేపు అలా పడి వుండి, ఆపై మళ్లీ బుల్లెట్ దెబ్బ తిని, ఆ తరువాత అన్ని అంతస్తుల మీద నుంచి కారుమీద పడి రక్తం కక్కుకుని, ఇంకా ఆ తరువాత భారీ ప్రమాదానికి గురైన హీరో బతుకుతాడని ఎవ్వరూ అనుకోరు. సినిమాలో తప్ప.
సరే, సీత కష్టాలు సీతవి..సినిమా వ్యవహారాలు సినిమావి. అందువల్ల ఆ వైనం వదిలేసి సీత సినిమా కథలోకి వస్తే..
తండ్రితో గొడవపడి ఏడు కోట్లు తీసుకుని, వంద కోట్లుసంపాదించడానికి సిద్దపుడుతుంది సీత (కాజల్). ఆమెకు నరనరానా ఆటిట్యూడ్..యారోగెన్సీ. అలాంటి సీత ఓ స్థలం ఖాళీ చేయించే విషయంలో బసవరాజు (సోను సూద్) సాయం కోరుతుంది. అతగాడు తనతో కొన్ని రోజులు కాపురం చేసే అగ్రిమెంట్ మీద సాయం చేస్తాడు. కానీ పని అయ్యాక సీత, సారీ..టేకిట్ ఈజీ..లైట్ తీస్కో అంటుంది. దాంతో బసవరాజు నిజంగా పశువే అయిపోయి, అన్ని విధాలా సీతను కార్నర్ చేసి పక్కలోకి లాగాలని చూస్తాడు. ఇదో ట్రాక్ అయితే, సీత తండ్రి వేల కోట్ల ఆస్తిని మేనల్లుడు రఘురామ్ (బెల్లంకొండ శ్రీనివాస్) పేర రాసి, అతగాడిని పెళ్లి చేసుకుంటేనే సీతకు ఆస్తి అని షరతు పెట్టి పోతాడు. అతగాడు జడ్డితనానికి ఎక్కువ అమాయకత్వానికి తక్కువ అన్నట్లు వుంటాడు. ఈ రెండు ట్రాక్ లను అల్లుకుంటూ నడిపిన కథే సీత.
సీత అన్న పేరు ఎంత పాతదో, ఈ కథ అంత పాతది. సీత అన్న పేరు ఎంత పాతదో, ఈ సినిమాలో కామెడీ ట్రాక్ అంతకన్నా పాతది. కామెడీ ట్రాక్ చూసి, కితకితలు పెట్టుకున్నా నవ్వురాదు. సినిమాను హీరో కోసం తీసారా? లేక విలన్ గా నటించిన సోనూ సూద్ కోసం తీసారా అన్న అనుమానం రీలు రీలుకి పెరుగుతూ పోతుంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చూసిన ప్రేక్షకులు ఆమె పడే కష్టాలకు అస్సలు జాలిపడేది వుండదు. ఐటమ్ సాంగ్ ను ఇరికించిన, అతికించిన తెలివితేటలు చూసి, అయ్యో అనుకోక తప్పదు.
సీత సినిమా తొలిసగం సాదా సీదా సీదాగా ప్రారంభమై, మరింత సాదాగా నడచి, అంతే మామూలుగా విశ్రాంతికి చేరుకుంటుంది. చూసిన ప్రేక్షకుడిని ఎలా వుందీ అంటే చెప్పలేక బ్లాంక్ ఫేస్ పెట్టేలా వుంటుంది. బాగుందా అంటే బాగుందని చెప్పలేడు. బాలేదూ అంటే బాలేదని అనలేడు. బెంగుళూరులో సినిమా ఎలా వుంటుందీ అని ఎవరో అడిగితే తేజ ఇలాగే కిందా మీదా అయ్యాడని చెప్పాడు. ఎందుకు అలా అయ్యాడో తొలిసగం చూసాక అర్థం అవుతుంది.
మలిసగంలోకి సినిమా ప్రవేశించాక సినిమా గ్రాఫ్ కిందకు దిగడం ప్రారంభమవుతుంది. కోర్టు సీన్లు, ప్రీ క్లయిమాక్స్ సీన్లు, క్లయిమాక్స్ అన్నీ వేటికి అవే ఒకదానిని మించి మరొకటి పోటీ పడతాయి. కమర్షియల్ సినిమాకు లాజిక్ లు వదిలేయవచ్చు కానీ, ఫార్మాట్ ను మరీ దాటేయకూడదు. ఎందుకుంటే బెల్లంకొండ అంటనే పాటలు ఫైట్లు. అలాంటిది సినిమాలో ఒక్క డ్యూయట్టూ లేదు. హీరో మీద కాకుండా హీరోయిన్ ఎలివేషన్ మీద సోలో సాంగ్. ఆపై మాంటేజ్ సాంగ్ లాంటి నేప థ్యగీతం. ద్వితీయార్థంలో ఐటమ్ సాంగ్.
ఎ క్లాస్ జనాలకు పాతచింతకాయపచ్చడి లాంటి కథ నచ్చదు. బిసి సెంటర్లకు కావాల్సిన కమర్షియల్ టచ్ లేదు. ఆదుకునేది కాస్త సోనూసూద్, తనికెళ్ల భరణిల మధ్య నడచిన కాసిన్ని కామెడీ సీన్లు మాత్రమే. అది కూడా బిసి సెంటర్లలోనే. హీరొయిన్ ను పక్క మీదకు లాగడం కోసమే నడిచే సినిమా ఫ్యామిలీలకు దగ్గరవుతుందని తేజ కానీ బెల్లంకొండ కానీ ఎలా అనుకున్నారో? సీత అన్న టైటిల్ ఒక్కటి చాలు అని అనుకున్నారేమో?
హీరోయిన్ తండ్రిగా భాగ్యరాజా నటించిన సీన్లు బ్లాక్ అండ్ వెైట్ లో చూపించనక్క్లరలేదు. అవి కలర్ లో చూపించినా, జమానా కాలం నాటి సీన్లలాగే వుంటాయి. సినిమాలో పాత్రల ప్రాధాన్యతకు నెంబర్లు ఇవ్వాలంటే విలన్ కు నెంబర్ వన్ ఇచ్చి, హీరో కి మూడో నెంబర్ కేటాయించాలి. ఇలా చేయడం వైవిధ్యం అని హీరో అనుకుని వుంటే, అది వేరే సంగతి. విలన్ కు పేజీలకు పేజీల డైలాగులు రాసేసారు. హీరోయిన్ గా కాజల్ ఆటిట్యూడ్ కథ ప్రకారం కరెక్ట్ నే కావచ్చు కానీ, చూడడానికి కాస్త ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. హీరో మాత్రం స్వాతిముత్యం కాబట్టి ఆ సీన్లు ప్రశాంతంగా వుంటాయి. ప్రారంభంలో హీరొ ను సూపర్ పవర్ మాన్ గా చూపించే ప్రయత్నం చేసి, కానీ తరువాత తరువాత కేవలం కోర్టు సీన్ కు మాత్రమే పరిమితం చేసారు.
సినిమాలో అన్నింటికన్నా టెక్నికల్ వాల్యూస్ బెటర్ . సినిమాటోగ్రఫీ, లోకేషన్లు, బ్యాక్ గ్రవుండ్ స్కోర్, బాగున్నాయి. మాటలు గుర్తుపెట్టుకునేంతగా ఏమీ లేవు. కామెడీ ట్రాక్ అయితే నవ్వుల పాలు తప్ప, నవ్వించేది కాదు. బెల్లంకొండ శ్రీనివాస్ చేయడానికి పెద్దగా ఏమీ లేదు. సోనూసూద్ బాగా చేసాడు అనిపించుకుంటాడు. కాజల్ ఓకె. మిగిలిన వారి గురించి చెప్పుకోవడాని ఏమీ లేదు.
దర్శకుడు తేజ సాధారణంగా కాస్త అతి చేస్తుంటారు సినిమాల్లో. ఈ సినిమాలో మాత్రం కాస్త తగ్గారు. కానీ అటు క్లాస్ ను ఇటు మాస్ ను కూడా మెప్పించే విధమైన సినిమా కానీ, ఏదో వర్గాన్ని ఒప్పించే సినిమా కానీ తీయలేకపోయారు.
ఫినిషింగ్ టచ్… సినిమా సినిమాకు బెల్లంకొండ కరుగుతోంది.
తెలుగు360 రేటింగ్: 2.25/5