అందాల రాక్షసితో ఓ మెరుపులా మెరిశాడు హను రాఘవపూడి. ఆ సినిమా చూసి క్లాస్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మరో… మణిరత్నం వచ్చాడని కితాబులు ఇచ్చారు. దాంతో.. హనుకి టాలీవుడ్ లో ద్వారాలు తెరచుకొన్నాయి. కృష్ణగాడి వీర ప్రేమగాథతో మరో హిట్టు అందుకొన్నాడు. తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకొన్నాడు. అయితే.. ఆ తరవాత సీన్ రివర్స్ అయ్యింది. భారీ బడ్జెట్ సినిమా గా తెరకెక్కిన `లై` డిజాస్టర్ గా నిలిచిపోయింది. `పడి పడి లేచె మనసు` కూడా ఫ్లాపుల జాబితాలో చేరిపోయింది. హనుకి మరో పెద్ద సినిమా పడడం కష్టమనుకుంటున్న తరుణంలో.. అనూహ్యంగా వైజయంతీ మూవీస్ నుంచి పిలుపొచ్చింది. అలా…. `సీతారామం` పట్టాలెక్కింది.
దుల్కర్ సల్మాన్ హీరో, హను రాఘవపూడి దర్శకుడు.. రూ.45 కోట్ల పెట్టుబడి – అనేసరికి అంతా ఆశ్చర్యపోయారు. కాంబినేషన్ పరంగా అనుమానాలు కొన్నుంటే, అసలు హనుని నమ్మి ఇంత పెట్టుబడి పెట్టడం అవసరమా? అనే అనుమానాలు రేకెత్తాయి. అయితే కథ విషయంలో.. చాలా పట్టుగా ఉండే వైజయంతీ మూవీస్, ఈ సినిమాని స్క్రిప్టు దశలోనే నగిషీలు దిద్ది.. `అంతా ఓకే..` అనుకున్న తరవాతే.. పట్టాలెక్కించింది. సినిమా పూర్తయ్యాక…. భారీ ప్రమోషన్లతో అందరి దృష్టీ ఈ సినిమాపై పడేలా చేసుకొంది. ట్రైలర్ వచ్చాక… చాలామంది అనుమానాలు తీరిపోయాయి. ఈ సినిమాపై ఓ క్లాస్ లుక్ పడింది. హను ఈ లవ్ స్టోరీని బాగా హ్యాండిల్ చేసి ఉంటాడన్న నమ్మకం కుదరింది.
నిజానికి హను లవ్ స్టోరీలు బాగా తీస్తాడు. పడి పడి లేచె మనసు సినిమా ఫ్లాప్ అయినా.. అందులో లవ్ స్టోరీ గమ్మత్తుగానే ఉంటుంది. `సీతారామం` పూర్తి స్థాయి ప్రేమకథ కాబట్టి… హను తన మార్క్‌ని ఈ సినిమాలో చూపించే ఉంటాడన్న భరోసా కలుగుతోంది. ఇది హనుకి చివరి అవకాశం. ఎందుకంటే… మరో ఫ్లాప్ పడితే – హనుని నమ్మడానికి నిర్మాతలెవరూ ధైర్యం చేయరు. కాబట్టి హను రాఘవపూడి కూడా తన పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలు ఈ సినిమాపై పెట్టి – ఓ క్లాసిక్ లవ్ స్టోరీని తీశాడనే ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి.. హను రాఘవపూడి లైన్లోకి వస్తాడా, లేదంటే.. మరో ఫ్లాప్ తో.. పూర్తిగా కనుమరుగు అవుతాడా? అనేది సీతారామంతో తేలిపోతుంది.