ఐటమ్ సాంగులందు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాల్లో ఐటమ్ సాంగులు వేరయా అనాల్సిందే. ఏదో అందుబాటులో వున్న అందాల భామలను కాకుండా ఎవరో ఒక అగ్ర కథానాయిక లేదా ప్రేక్షకుల్లో క్రేజ్ వున్న అందాల భామను ఐటమ్ సాంగ్ కోసం తీసుకొస్తాడు. ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ సినిమాల్లో తమన్నా, ‘జయ జానకి నాయక’లో కేథరిన్ సందడి చేశారు. ‘సాక్ష్యం’, ‘కవచం’ సినిమాల్లో ఐటమ్ సాంగుల్లేవ్. ప్రత్యేక గీతాలకు కాస్త విరామం ప్రకటించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మళ్లీ ‘సీత’తో షురూ చేయనున్నాడు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సీత’. గణతంత్ర దినోత్సవానికి టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. బెల్లంకొండ, కాజల్ జోడీ రెండోసారి నటిస్తున్న సినిమా ఇది. ఇందులో మన్నారా చోప్రా రెండో కథానాయికగా నటిస్తుంది. అలాగే, ప్రత్యేక గీతంలో పాయల్ రాజ్పుత్ సందడి చేయనుంది. ‘ఆర్.ఎక్స్. 100’తో క్రేజ్ తెచ్చుకున్న ఈ భామతో సాయి శ్రీనివాస్ స్టెప్పులు వేయనున్నాడు.
పాయల్ రాజ్పుత్ పాట ఒక్కటీ మినహా ‘సీత’ సినిమా పూర్తయింది. ఫిబ్రవరి 11 నుంచి స్పెషల్ సెట్ లో ఆ పాటను చిత్రీకరించనున్నారు. హైదరాబాద్ లో ఫేమస్ స్టూడియోలో పాట కోసం స్పెషల్ సెట్ వేస్తున్నారు. ఆల్రెడీ అనూప్ రూబెన్స్ ఓ క్యాచీ ట్యూన్ రెడీ చేశార్ట.