ధనసరి అనసూయ అలియాస్ సీతక్క. అడవుల్లో నివసించే గిరిజనం ఎక్కువగా ఉండే ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆమె ఇప్పుడు.. అందరికీ అక్కగా కాదు.. అమ్మగా మారిపోతున్నారు. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి ఆమె… తన నియోజకవర్గంలోని గ్రామాలకు వెళ్తూనే ఉన్నారు. తన వెంట పెద్ద ఎత్తున సహాయ సామాగ్రి తీసుకెళ్తూనే ఉన్నారు. అందరికీ పంచుతూనే ఉన్నారు. పట్టణాల్లో పేదలకు సాయం చేయడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. పల్లెల్లో పరిస్థితిని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక దారులే ఉండని గిరిజన గ్రామాల్లోని వారి పరిస్థితిని ఎవరు పట్టించుకుంటారు..? ములుగు ఎమ్మెల్యే సీతక్క మాత్రం.. అలా అనుకోలేదు. లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండి ఆమె తన నియోజకవర్గంలోని గ్రామాల కు వెళ్తూనే ఉన్నారు.
ములుగు నియోజకవర్గంలో అత్యధిక గ్రామాలకు కాలిబాటలే ఉంటాయి. అక్కడి ప్రజలకు ఉపాధి కరువయింది. ఈ విషయం ఆమెకు తెలుసు కాబట్టి.. అందరికీ వీలైనంతగా నిత్యావసర సరుకులు అందించాలని నిర్ణయించుకున్నారు. గత నలభై రోజులుగా ఆమె.. దాదాపుగా నియోజకవర్గంలో ని మరుమూల గ్రామాలన్నింటినీ చుట్టేశారు. వాహనం వెళ్లలేని చోట తానే కాలినడకన వెళ్తున్నారు. వస్తువుల సంచుల్ని తానే భుజాల వేసుకుని మోసుకెళ్తున్నారు. ములుగు నియోజకవర్గంలోని వాజేడు, పెనుగోలు అనే గ్రామాలు గ్రామం తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉంటాయి. అక్కడికి వెళ్లాలంటే 15 కిలోమీటర్లు నడవాలి. సీతక్క నడుచుకుంటూ వెళ్లి అక్కడి ప్రజలకు నిత్యావసర సరుకులు అందించి వచ్చారు.
సీతక్క చేస్తున్న సేవలు చూసి.. పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల వారు కూడా… పేదలకు పంచమని.. నిత్యావసర వస్తువులు పంపుతున్నారు. వీటి కోసం.. ఆమె పేదలకు అన్నం పెట్టాలనే చాలెంజ్ కూడా విసిరారు. వారికి సమస్యను అర్థం చేసుకునేంత పరిజ్ఞానం ఉండదు కాబట్టి.. కరోనా గురించి అక్కడి వారికి వివరించి.. జాగ్రత్తలు కూడా చెప్పి వస్తారు. గతంలో నక్సలైట్ గా పని చేసిన సీతక్కకు.. అడవి బిడ్డల కష్టాలు తెలుసు. ఆ కష్టం తాను కూడాపడ్డారు. అందుకే.. వారిని ఈ కష్ట సమయంలో ఆదుకోవడానికి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గతంలోనూ ఆమె ఈ తరహా సేవలు చేశారు. కానీ.. అప్పట్లో సోషల్ మీడియా అమెకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పుడు.. అదే సోషల్ మీడయాద్వారా ఆమె సేవలు ప్రపంచానికి తెలుస్తున్నాయి.