పెద్ద హీరోలకి ఉన్న పేరు ప్రఖ్యాతులు, అభిమానుల ఆదరణ, వారి సినిమాలాపై భారీ అంచనాలు వగైరాల కారణంగా వారు గిరిగీసుకొని ఒక పరిధిలోనే సినిమాలు చేయవలసి ఉంటుంది. ఈ సమస్య చాలా కాలంగా ఉన్నప్పటికీ, ఇదివరకు సినిమాలలో కధకి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు కనుక ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్., శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు,చిరంజీవి వంటి పెద్ద హీరోలు అందరికీ అనేక రకాల పాత్రలు పోషించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పెద్ద హీరోలు అటువంటి ప్రయోగాలు చేయాలంటే చాలా రిస్క్ తో కూడుకొన్న పని. ఏదయినా తేడా వచ్చినట్లయితే అందరూ తీవ్రంగా నష్టపోతారు. అందుకే పెద్ద హీరోలు అందరూ ఒక మూస ఫార్ములాలో రకరకాల ఆయుధాలు పట్టుకొని విలన్ మూకలని నరుక్కొంటూ కాలక్షేపం చేసేస్తున్నారు. ఎప్పుడో కానీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,’ ‘దృశ్యం’ ‘శ్రీమంతుడు’ వంటి సినిమాలు రావడం లేదు.
ఇది చిన్న హీరోల పాలిట వరంగా మారిందని చెప్పవచ్చును. అల్లరి నరేష్, నానీ, రాజ్ తరుణ్ వంటి హీరోలు ఇంకా ఈ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోలేదు కనుక చాలా హాయిగా స్వేచ్చగా రకరకాల కధలను, మంచి మంచి పాత్రలను ఎంచుకొని సినిమాలు చేస్తూ అందరినీ ఆకట్టుకొంటున్నారు. వారి సినిమాలన్నీ చాలా తక్కువ బడ్జెట్ తో తయారవుతున్నందున దాదాపు ప్రతీ సినిమా కూడా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు పండిస్తోంది. ‘ఉయ్యాలా జంపాలా’ తో తెలుగు సినీపరిశ్రమలోకి ప్రవేశించిన రాజ్ తరుణ్ “సినిమా చూపిస్తా మావా” అంటూ చాలా మంచి సినిమాయే చూపించేడు. దాని తరువాత ‘కుమారి 21f అనే చాలా వెరైటీ స్టోరీతో మళ్ళీ అందరినీ ఆకట్టుకొన్నాడు. ఆ తరువాత “సీతమ్మ అందాలు..రామయ్య సిత్రాలు” అనే సినిమా పూర్తి చేసేసి మరో కొత్త సినిమా చేయడానికి సిద్దం అయిపోతున్నాడు.
సీతమ్మ అందాలు..రామయ్య సిత్రాలు సినిమాలో కొత్తగా పరిచయమవుతున్న ఆరాధన అనే అందాలభామ రాజ్ తరుణ్ తో జంటగా నటించింది. ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ దాదాపు పూర్తయిపోయాయి. సెన్సార్ పని కూడా పూర్తయిపోయింది. ఒక్క కట్ కూడా లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ దక్కించుకొంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమా చాలా బాగుందని మెచ్చుకొన్నట్లు సమాచారం. ఈనెల 29న విడుదల కాబోతున్న ఈ సినిమాకి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహించగా, గోపి సుందర్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాని శ్రీధర్ రెడ్డి, శైలేంద్ర బాబు మరియు హరీష్ కలిసి నిర్మించారు. ఈ మధ్య కాలంలో విడుదలవుతున్న మంచి కుటుంబ కధా చిత్రాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి కనుక ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు.