ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్… తమ్మినేని సీతారాం.. పదవి చేపట్టినప్పటి నుండి చాలా ఆదర్శాలు చెప్పారు. నిబంధనల ప్రకారమే నడుచుకుంటానని… పార్టీ ఫిరాయిస్తే.. అనర్హతా వేటు వేస్తానని పదే పదే చెప్పుకొచ్చారు. అయితే.. ఆయవన్నీ మాటలేనని.. అసెంబ్లీ సమావేశాల రెండో రోజే తేలిపోయిందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. టీడీపీ తరపున అసెంబ్లీకి ఎన్నికై… వైసీపికి బహిరంగ మద్దతు పలికిన వల్లభనేని వంశీకి సభలో స్పీకర్ తమ్మినేని మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీంతో.. ఆశ్చర్యపోవడం.. టీడీపీ నేతల వంతయింది.
దేశ దేశ చరిత్రలో ఏపీ అసెంబ్లీ జరిగిన తీరు విస్మయానికి గురి చేస్తోందని టీడీపీ అంటోంది. క్వశ్చన్ అవర్ జరుగుతున్నప్పుడు సభలో వంశీకి ఏ నిబంధనల ప్రకారం అవకాశం ఇచ్చారని..టీడీపీ నేతలు ప్రశ్నించారు. క్వశ్చన్ అవర్ సమయంలో సభలో చర్చ జరగకూడదని స్పీకర్ గతంలోనే చెప్పారని, మరి వంశీకి సభలో సీటు ఇవ్వమని క్వశ్చన్ అవర్లో అడగడం ఏంటని చిన రాజప్ప ప్రశ్నించారు. అసెంబ్లీ చరిత్రలో ఇదో దుర్దినమని మండిపడ్డారు. వంశీ పార్టీ మారాలంటే రాజీనామా చేసి వెళ్లాలని వారు హితవుపలికారు. స్పీకర్ వంశీని ప్రత్యేక సభ్యునిగా ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు.
ఉదయం సభలో ప్రశ్నోత్తరాల సమయంలో .. వల్లభనేని వంశీకి మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ కల్పించారు. నిజానికి ప్రశ్నోత్తరాల సమయంలో.. కేవలం ప్రశ్నలు.. దానికి సంబంధించిన అంశాలపై..మాత్రమే మాట్లాడాలి. కానీ వంశీ మాత్రం… టీడీపీ గురించి.. చంద్రబాబు గురించి.. పప్పులు.. పలావులు అంటూ.. బయట ప్రెస్మీట్లో మాట్లాడినట్లు మాట్లాడారు. టీడీపీలో ఉండలేకపోతున్నానని.. తనకు ప్రత్యేక సీటు కేటాయించాలని కోరారు. ఈ అవకాశాన్ని స్పీకర్ కల్పించడంతో.. సభా సంప్రదాయాలు పాటించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్పీకర్ ఆదర్శాలు మాటలకేనని తేలిపోయిందని.. కోడెల కు.. తమ్మినేనికి తేడా లేదన్న అభిప్రాయం.. రాజకీయవర్గాల్లోనూ ప్రారంభమయింది.