రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలకు సాయం చేయడం అంటే.. మద్దతుగా ప్రచారం చేయడం మాత్రమే కాదు. వాళ్లను తీవ్రంగా వ్యతిరేకించి… నానా తిట్లు తిట్టడం కూడా.. ఓ రకంగా సాయమే. ముఖ్యంగా.. బీజేపీ లాంటి పార్టీలకు.. హిందూత్వం లింక్ పెట్టి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే… అది ఆ పార్టీని..ఆ పార్టీ నేతలను విమర్శించినట్లు కాదు. ఇంకా చెప్పాలంటే.. మేలు చేసినట్లు. ఇప్పుడు… కమ్యూనిస్టు పెద్ద.. సీతారాం ఏచూరీ అదే చేశారు. బీజేపీకి సరైన టాపిక్ లేక… ఇబ్బంది పడుతున్న సమయంలో.. ఆయనో గొప్ప అస్త్రం అందించారు. దాంతో బీజేపీ ఇప్పుడు.. టాపిక్‌ను ఆ సైడ్ తీసుకెళ్లింది. ఇంతకీ ఆయన అన్న మా టఏమిటంటే… రామాయణ, భారతాల్లోనూ.. హింస ఉందని… హిందువులు హింసావాదులని ఆయన వ్యాఖ్యానించారు.
” హిందువులు హింసావాదులు కాదని ఎవరన్నారు? హింసకు పాల్పడతారని రామాయణ భారతాలు నిరూపించడం లేదా?” అని ఓ సభలో నేరుగానే విమర్శలు గుప్పించారు. నిజానికి ఏచూరీ ఈ మాటలు అనడానికి కారణం.. బీజేపీ తీరును.. విమర్శించడం. ఇతర మతాల హింసను మాత్రం పెద్దదిగా చేస్తూ… హిందూమతంలో మాత్రం హింస లేదని ప్రచారం చేస్తున్నారని చెప్పాలనుకున్నారు. కానీ.. ఆయన చెప్పే విధానంలోనే తేడా వచ్చింది. దాంతో వివాదం అయిపోయింది. బీజేపీ ఇప్పుడు దీన్నో .. అవకాశంగా మల్చుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ నేతలు తీవ్రమైన విమర్శలు చేయడం మాత్రమే కాదు.. అక్కడక్కడా కేసులు కూడా పెడుతున్నారు. బాబా రామ్‌దేవ్..నేరుగా రంగంలోకి దిగి ఏచూరీపై పిర్యాదు చేశారు.
రాజకీయం అంటే.. తెలివిగా ప్రత్యర్థిని దెబ్బతీయగలగడం. కానీ ఇష్టం వచ్చినట్లు వారిని బలపరచడం కాదు. కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలకు..ఈ రాజకీయం ఒంటబట్టడం లేదని.. ఏచూరీ వ్యాఖ్యలతోనే తేలిపోయింది. చారిత్రాత్మక తప్పులతో.. కమ్యూనిస్టు పార్టీలకు.. చివరి రోజులు తెచ్చి పెట్టిన నేతలు.. ఇప్పటికీ కళ్లు తెరవడం లేదని.. తాజా పరిణామాలతో నిరూపితమవుతోంది. ప్రపంచంలో ఏ మతం కానీ.. ఏ మత గ్రంధం కానీ హింసను ప్రోత్సహించదు. ఈ విషయాన్నే చెప్పాల్సిన నేతలు… మరో రకంగా మాట్లాడుతూ… రాజకీయ అతి తెలివి తేటల్ని బయట పెట్టుకుంటున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు సీతారాం ఏచూరీ చేరారు.