ఏపీలో మరోసారి పోలీస్ బాస్ మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కొనసాగించడానికి జగన్ కు అవకాశం ఉంది కానీ.. ఆయన తాను ” అనుకున్న స్థాయిలో” లా అండ్ ఆర్డర్ ను .. మెయిన్ టెయిన్ చేయలేకపోతున్నారని జగన్ భావిస్తున్నారు. కొంత మొహమాట పడుతున్నారని.. అలాంటివి ఎన్నికల్లో పని చేయవని.. అందుకే కొత్త డీజీపీని నియమించుకోవాలని అనుకుంటున్నారు. నిజానికి రాజేంద్రనాథ్ రెడ్డిని పర్మినెంట్ గా నియమించలేదు. ఇంచార్జ్ గానే పెట్టారు.
గౌతం సవాంగ్ కు బలవంతపు రిటైర్మెంట్ ఇచ్చి ఏపీపీఎస్సీ చైర్మన్ ను చేసిన తర్వాత వెంటనే రాజేంద్రనాథ్ రెడ్డిని ఇంచార్జ్ గా నియమించారు. కొత్త డీజీపీని నియమించుకోవడం ఏపీ ప్రభుత్వ ఇష్టం కాదు. యూపీఎస్సీ ఇష్టం. సీనియర్ అధికారులతో యూపీఎస్సీకి జాబితా పంపితే… అందులో ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేసి ఏపీకి పంపుతారు. ఆ ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం ఎంపిక చేసుకోవాలి. పదహారు నెలలుగా రాజేంద్రనాథ్ రెడ్డిని ఇంచార్జ్ గానే ఉంచిన సీఎం జగన్.. ఆ ప్రక్రియ మాత్రం ప్రారంభించలేదు. ఇప్పుడు ఆయన వద్దనుకుంటున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇన్ఛార్జి డీజీపీ ఎక్కువ కాలం కొనసాగడం కుదరనందున ఆయన పేరు సహా డీజీ ర్యాంకు అధికారుల పేర్లతో జాబితా పంపాలంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో రెండు సార్లు లేఖలు రాసింది. ప్రభుత్వం నుంచి స్పందన లేనందున ఈ ఏడాది జనవరిలో డీఓపీటీ నుంచి మరో లెటర్ వచ్చినట్లుగా చెబుతున్నారు. అందుకే వీలైనంత ఆలస్యం చేసి తాజాగా కసిరెడ్డితోపాటు మరో ఐదు పేర్లతో కలిపి డీజీపీ నియామకం కోసం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
ముగ్గురి పేర్లు షార్ట్ లిస్ట్ చేసి పంపితే.. అందులో కసిరెడ్డి ఉన్నా లేకపోయినా.. ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న సీతారామాంజనేయులును డీజీపీగా ఎంపిక చేసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.