సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు తన డ్యూటీని వైసీపీ కోసం కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. లిక్కర్ స్కాంలో నిందితులందరికీ ఆయనే ప్రధాన సలహాదారుగా మారారని టీడీపీ వర్గాలంటున్నాయి. అసలు మద్యం స్కాంతో తనకేం సంబంధం అని సీఐడీ అధికారులతో ఈమెయిల్స్ లో వాదించిన రాజ్ కసిరెడ్డి విచారణకు రాకుండా పరారయ్యారు. ఆయన విచారణకు హాజరైతే బండారం మొత్తం బయట పడుతుందని ..పరారీ కావడమే మంచిదని సీతారామాంజనేయులు సలహా ఇచ్చి.. ఆయన సూచనల మేరకే ఆజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.
సీతారామాంజనేయులు వైసీపీ హయాంలో జగన్ సేవలో తరించారు. ఫోన్ ట్యాపింగుల నుంచి టీడీపీ నేతలపై వ్యక్తిగత దాడులు చేయడం వరకూ అన్నీ ప్రణాళికలు ఆయనే రెడీ చేసేవారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో చంద్రబాబుపై రాళ్ల దాడులకు ఆయన నేతృత్వంలోనే కుట్ర జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. చంద్రబాబు లాంటి పెద్ద వయసు వ్యక్తికి గట్టిగా రాయి తగిలితే ప్రాణానికి ప్రమాదం అని ఊహించే అలాంటి దాడులకు ఆయన ప్లాన్ చేశారని చెబుతారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆయనపై చాలా కేసులు పెట్టే అవకాశాలు ఉన్నా.. డైరక్ట్ గా అధికార దుర్వినియోగం చేసి మాఫియాలాగా వ్యవహరించిన ఒకటి రెండు అంశాల్లోనే కేసులు పెట్టారు. వాటిలోనూ అరెస్టు చేయలేదు. ఓ సారి హైకోర్టు నేరుగా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది కూడా.
ఇప్పుడు ఆయన తనకు ప్రభుత్వం ఇచ్చిన రిలీఫ్ ను.. గొప్పగా ఉపయోగించుకుని వైసీపీకి సేవ చేసుకుంటున్నారు. లిక్కర్ స్కాం నిందితుల్ని కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. సస్పెన్షన్ లో ఉన్న ఆయన విజయవాడ దాటి వెళ్లకూడదు. అలా వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలి. కానీ ఆయన హైదరాబాద్ లోనే ఉండి.. వైసీపీకి సేవల చేస్తున్నారు. దొంగల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఎదుర్కొంటున్నారు.