విశాఖలో అంతర్జాతీయ స్థాయి మాల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి గత ప్రభుత్వం ప్రఖ్యాత సంస్థ లూలూతో ఒప్పందం కుదుర్చుకుంది. శంకుస్థాపన కూడా జరిగింది. దాదాపుగా రెండు వేల రెండు వందల కోట్ల పెట్టుబడికి లూలూ గ్రూప్ అంగీకరించింది. అది నిర్మాణం అయితే.. కొన్ని వేల మందికి ఉపాధితో పాటు…అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు నిర్వహించాడనికి విశాఖలో ఓ బ్రహ్మండమైన వేదిక ఏర్పడేది. కానీ.. కొత్త ప్రభుత్వం రాగానే లూలూతో ఒప్పందం రద్దు చేసింది. ఆ సంస్థలపై వివాదాలు ఉన్నాయని… మరోకటని కారణాలుగా చెప్పింది. అయితే.. ఇప్పుడా స్థలాన్ని రియల్ ఎస్టేట్ లెక్కలో డెలవప్ చేసి అమ్మాలని నిర్ణయించుకుంది.
లూలూ నుంచి వెనక్కి తీసుకున్న స్తలంలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య సముదాయం నిర్మించి, చదరపు అడుగు రూ.6,800 చొప్పున విక్రయిస్తామని పేర్కొంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అభివృద్ధి చేయడానికి ఆసక్తి గల సంస్థలు ముందుకు రావాలని ఉత్తర్వుల్లో కోరారు. మొత్తంగా గత ప్రభుత్వం 10.65 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇచ్చింది. అందులో భవన నిర్మాణాలు చేసి అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని.. ఆరోపించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు.. అచ్చంగా రియల్ ఎస్టేట్ డెవలపర్గానే.. లూలూకి ఇచ్చిన స్థలం విషయంలో వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖలో ఇప్పుడు స్థలాల కొరత చాలా ఎక్కువగా ఉంది. పేదలకు.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం.. ఇలా కొన్ని వందల ఎకరాలు కావాల్సి వచ్చినప్పటికీ.. విలువైన భూముల్ని మాత్రం.. ప్రభుత్వం అమ్మకానికి పెడుతూనే ఉంది.