లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ కసరత్తు ప్రారంభమయింది. మూడో తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు విడివిడిగా జరగాలని కోరుకోవడమే బీఆర్ఎస్ పార్టీకి ముప్పుతిప్పలు తెచ్చి పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందున సిట్టింగ్ సీట్లలో పోటీ చేసేందుకు ఎంపీలు నిరాసక్తత చూపిస్తున్నారు.
ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. వీరు కాకుండా మరో ఇద్దరు ఎంపీలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం, గత ఐదేళ్లలో ఎంపీలుగా ఎదురైన అనుభవంతో కొందరు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటే.. మరికొందరు అధికార కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 9 మంది లోకసభ సభ్యులు ఉన్నారు. వీరిలో ఆర్థికంగా బలమున్నవారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. సిట్టింగ్ ఎంపీల్లో ఎక్కువ మందికి రేవంత్ రెడ్డితో గతంలో సన్నిహిత సంబంధాలు ఉండటంతో గులాబీ దళంలో అనుమానాలు ఎక్కువయ్యాయి. గత పదేళ్లుగా ఎదురైన అనుభవాలను తమ సన్నిహితుల దగ్గర ప్రస్తావిస్తున్న ఎంపీలు.. పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు హైకమాండ్ మాత్రం సిట్టింగ్ల అసంతృప్తిని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెడుతోంది. కొత్త వారిని అయినా లేకపోతే…. ఎమ్మెల్యేల్ని అయినా నిలబెట్టేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పరాజయం ఎదురైతే గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.