వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి అధికార తెలుగుదేశంలోకి వలసల పర్వం అప్పుడప్పుడే ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటికే 11 దాటిన స్కోరు ఇంకా పెరిగేలాగానే కనిపిస్తోంది. చిత్తూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాలనుంచి ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు మాటలు మంతనాల్లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీనే నమ్ముకుని ఎప్పటినుంచో సేవలందిస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయం! ఇప్పుడు వస్తున్న వైకాపా ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల సమయానికి ‘సిటింగు’ కోటాలో టికెట్ ఎగరేసుకుపోతారని… తాము కేవలం జెండాలు మోయడానికే పరిమితం అవుతామని ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబునాయుడు శనివారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు ఇదే సంగతులు ఆయన దృష్టికి వచ్చాయి. అయితే ఆయన మాత్రం పార్టీ వారందరికీ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
ట్విస్టు ఏంటంటే.. వచ్చే ఎన్నికల సమయానికి ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయని అందరికీ అవకాశాలు ఉంటాయని ఆయన తాయిలాలు పెడుతున్నారు. అయితే సీట్ల పెంపు అనేది ఓ ఊహ మాత్రమే. ఖచ్చితంగా సీట్లు పెరుగుతాయని ఎవ్వరూ చెప్పలేరు. చంద్రబాబునాయుడు చెప్పినా.. అది కేవలం తమ వారిని జో కొట్టడానికి ఉపయోగపడుతుందే తప్ప.. నమ్మడానికి వీల్లేదు. వెంకయ్యనాయుడు కూడా.. కేంద్రంలో సంప్రదిస్తున్నా.. ఈ సమావేశాల్లో బిల్లుపెట్టే ప్రయత్నం చేస్తున్నాం అని నర్మగర్భపు వ్యాఖ్యానాలు చేస్తున్నారే గానీ.. నిర్దిష్టంగా ఎట్టి పరిస్థితుల్లోనూ శాసనసభ నియోజకవర్గాల పెంపు 2019 లోగా ఉంటుంది. అనే మాటను ధీమాగా చెప్పలేకపోతున్నారు.
మరి ఒక ఊహాజనితమైన పరిణామం గురించి ఊరిస్తూ.. అసంతృప్తితో వేగుతున్న పార్టీ శ్రేణులను జోకొట్టడానికి చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నం ఎంత మేరకు ఫలితం ఇస్తుందనేది ఇప్పుడు చెప్పలేం. ఆయన కొత్త నియోజకవర్గాల మాటే చెబుతూ.. ఇదే ధోరణి అవలంబిస్తూ పోతే గనుక.. అది జరగని పని అని తేలిన రోజున పార్టీలో అసంతృప్తి ఒక్కసారిగా భళ్లున బద్ధలు కావొచ్చు. మరొకవైపు పాతవారికి ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతనే.. కొత్త వారి అవకాశాలను పరిశీలిస్తాం అంటూ ఆయన చెబుతున్న మాటలు కూడా కార్యకర్తలు నమ్మగలిగేవి కాదు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబునాయుడు మాట్లాడాల్సి ఉంటుంది.