దేశం మొత్తం మరో మూడు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి భిన్నమైన మార్గం ఎంచుకునే పరిస్థితి లేదు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలనుకున్న ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరంగా మారింది. మామూలుగా అయితే. ఎస్ఈసీగా ఉన్నప్పుడు రమేష్ కుమార్ తీసుకున్న వాయిదా నిర్ణయం ఆరు వారాల పాటు అమల్లో ఉంటుంది. ఆరు వారాల తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. అయితే.. కొత్త ఎస్ఈసీని నియమించిన ఏపీ సర్కార్ .. ఆ నిర్ణయాన్ని సమీక్షించి.. ఎన్నికలు నిర్వహించాలనుకుంది. ఇప్పుడు అసలు సాధ్యం కాని పరిస్థితి. వచ్చే నెల మూడో తేదీ తర్వాత కూడా.. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా లేదా అన్నది చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. రమేష్ కుమార్ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన సమయంలో.. పోలింగ్‌కు 4 వారాల ముందు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమల్లోకి తీసుకురావాలని ఆదేశించింది.
ప్రభుత్వం పంచాయతీ. మున్సిపల్ ఎన్నికల కోసం కొత్తగా ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. ఆ ఆర్డినెన్స్ ప్రకారం.. ఎన్నికల ప్రక్రియ పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ముగించాల్సి ఉంది. కానీ అసాధారణ పరిస్థితుల వల్ల… నామినేషన్ల దశలోనే ఆగిపోయింది. ఈ మధ్యలో.. ఆరు వారాలు పూర్తవుతున్నాయి. అభ్యర్థులు ప్రచారం చేస్తూనే ఉన్నారు. అంటే.. ఆర్డినెన్స్ లెక్క ప్రకారం చూస్తే.. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియ చెల్లదనే అభిప్రాయాన్ని న్యాయనిపుణులు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఆర్డినెన్స్‌ను చట్ట రూపంలోకి తీసుకు రావాల్సి ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలే నిర్వహించలేని పరిస్థితిలో ఏపీ సర్కార్ ఉంది.
స్థానిక ఎన్నికలు అసలు గత ప్రభుత్వ హయాంలోనే జరగాల్సి ఉంది. ఎన్నికలకు ముందు రిస్క్ ఎందుకు అనుకున్న టీడీపీ అధినేత ఎన్నికలయిన తర్వాత నిర్వహించాలనుకున్నారు. అయితే ఓడిపోయారు. కొత్తగా సీఎం బాధ్యతలు చేపట్టిన జగన్.. పథకాలన్నీ అమలు చేసి.. ఎన్నికలు నిర్వహించాలనుకున్నారు. చివరికి.. రిజర్వేషన్ల చిక్కులతో ఆగి.. ఆగి.. మార్చిలో నిర్వహించాల్సి వచ్చింది. పదో తరగతి పరీక్షలు. బడ్జెట్ సమావేశాలను కూడా పెండింగ్‌లో పెట్టి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే.. కరోనా వచ్చి పడింది. అయినా మొండిగా ఎలాగోలా ఎన్నికలు నిర్వహిద్దామనుకుంటే.. సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. స్థానిక ఎన్నికల ప్రక్రియను ఇప్పుడల్లా ముందుకు నడిపించడం సాధ్యం కాదన్న అభిప్రాయం అధికారవర్గాల్లోనే ఉంది.