సీఎం జగన్‌ను ట్రోల్ చేస్తూ మంచు లక్ష్మి పోస్ట్ పెట్టడంపై ఇండస్ట్రీలోనే కాదు.. రాజకీయవర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఆ ట్రోలింగ్‌ను ఆమె ఉంచారా.. తీసేశారా అన్న సంగతి పక్కన పెడితే .. ఆ కుటుంబంలో వైఎస్ జగన్‌పై అసంతృప్తి కనిపిస్తోందన్న మాట మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి కారణం ఎంతో రిస్క్ తీసుకుని .. కేసుల పాలై కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికితే కనీస ప్రాధాన్యత కూడా లభించకపోవడమే.
ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. అందుకే జగన్ గత ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసిన వారికి జగన్ పదవులు ప్రకటిస్తున్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి ఇచ్చారు. మంగ్లీకి టీటీడీ ఎస్వీబీసీ చానల్లో సలహాదారు పదవి ఇచ్చారు. పోసానికి ఎప్డీసీ చైర్మన్ పోస్టు ఇచ్చారు. చిన్నా చితకా వారికి తగిన ప్రాధాన్యం కల్పించారు కానీ. మోహన్ బాబుకు మాత్రం కనీసం అపాయింట్మెంట్ దొరకడం గగనం అయిపోయింది.
గత ఎన్నికల ముందు అదీ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాలేజీ విద్యార్థుల్ని తీసుకుని రీఎంబర్స్మెంట్ నిధులు ఇవ్వలేదని ఇద్దరు కొడుకులతో కలిసి రోడ్డెక్కారు. ధర్నా చేశారు. ఈ అంశంపై కేసు కూడా నమోదయింది. వాయిదాలకు తిరుగుతున్నారు. తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయనకు ఏదైనా ప్రాధాన్యం లభిస్తుందేమో అనుకున్నారు. కానీ అలాంటి సూచనలేమీ కనిపించలేదు.
మోహన్ బాబు కనీసం ఒక్క టర్మ్ అయినా టీటీడీ కి చైర్మన్‌గా చేయాలని అనుకుంటున్నారు. అది ఆయన కోరిక కూడా. ఆ పదవి ఇస్తారని అనుకున్నారు. అసలు అాలంటి ఆలోచనే జగన్ చేయలేదు. అదొక్కటే కాదు. ఏ పదవీ ఇంత వరకూ ఇవ్వలేదు. ఇస్తారన్న గ్యారంటీ కూడా లేకుండా పోయింది. ఈ అసంతృప్తిని ఆ కుటుంబం బహిరంగంగా చూపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.