దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విశాఖ రసాయన కలకలం అనేక కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 12 మంది మృతి చెందగా, వందలాది మంది కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ ప్రాంత దరిదాపుల్లోని ప్రజలు ఇప్పటికీ బంధువుల ఇళ్లలో , శిబిరాలలో తలదాచుకుంటున్నారు. మిగతా వారిలో కూడా దీని కారణంగా దీర్ఘకాలంలో వచ్చే క్యాన్సర్ వంటి ప్రమాదాల భయం వెంటాడుతోంది. అయితే ఈ నేపథ్యంలో విషవాయువు విపత్తుకు కారణమైన పాలిమర్స్ కంపెనీ మేనేజ్మెంట్ ప్రతినిధులతో భేటీ అయిన ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ప్రస్తుత పరిస్థితిపై కీలక ప్రకటన చేశారు.
ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అనంతరం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, రసాయనాలతో ఉష్ణోగ్రతలను కంపెనీ వారు తగ్గిస్తున్నారు అని, గాల్లో ప్రమాదానికి కారణమైన స్టైరీన్ గ్యాస్ కూడా ప్రస్తుతం బాగా తక్కువ మోతాదులోనే ఉందని, 48 గంటల్లో సాధారణ స్థితి నెలకొంటుందని ప్రకటించారు. అంతేకాకుండా, రాష్ట్రంలో 86 ప్రమాదకర కంపెనీలను గుర్తించామని వాటిలో ప్రమాణాలను కూడా పరిశీలించాల్సి ఉంటుందని ఆయన ప్రకటించారు.
ఏది ఏమైనా ఎల్జి పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అనంతరం పరిశ్రమల శాఖ మంత్రి ప్రజలకు భరోసా ఇస్తున్నప్పటికీ, కంపెనీ పరిసర ప్రాంత ప్రజలలో మాత్రం ఇప్పటికీ భయాందోళనలు కొనసాగుతున్నాయి.