కాటమరాయుడు షూటింగ్లో పవన్ కల్యాణ్‌కి షాక్ ఇచ్చాడు నటుడు శివ బాలాజీ. పవన్ నటిస్తున్న ఈ చిత్రంలో శివబాలాజీ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాటమరాయుడు సెట్లో పవన్‌ని ఓ బహుమతి ఇచ్చి టీమ్‌నే కాకుండా,.. పవన్‌ని కూడా ఆశ్చర్యపరిచాడు శివబాలాజీ. పవన్‌కి ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా..?? ఓ అరుదైన కత్తి. ఈ కత్తికి పిడి భాగంలో జన సేన లోగో ఉంటుంది. శ్రీచక్రం, పవన్ ఫొటో, సంభవామి యుగే యుగే అనే శ్లోకం.. కత్తిపై ముద్రించారు. బంగారు పూత పూసిన ఈ కత్తిని డెహ్రాడూన్‌లో ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు శివ బాలాజీ. ఈ కత్తిని చూసి పవన్ ముచ్చటపడడం, కాసేపు దాంతో ఆడుకోవడం ఇవన్నీ ఓ వీడియో చేసి విడుదల చేసింది చిత్రబృందం.
”పవన్‌కి ఎప్పటి నుంచో ఓ మంచి కానుక ఇవ్వాలనుకొంటున్నా. ఏం ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? అనేది అంతు పట్టలేదు. జనసేన పార్టీ పెట్టి ప్రజల తరుపున పోరాడుతున్న యుద్ధ వీరుడు కాబట్టి పవన్ కోసం ఓ కత్తి డిజైన్ చేయించాం. జన సేన పవన్ అనగానే ఆవేశంతో కూడిన పవన్ ఫేస్ ఒకటి మైండ్లోకి వస్తుంది. దాన్ని లోగోగా మర్చి ముద్రించాం” అంటూ ఈ కత్తి తాలుకూ డిటైల్స్ చెప్పుకొచ్చాడు శివ బాలాజీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్‌లో హల్ చల్ చేస్తోంది. కాటమరాయుడు టీజర్ తరవాత.. పవన్ నుంచి వచ్చిన స్పెషల్ వీడియో ఇదే. నిజంగానే శివబాలాజీ ఇచ్చిన గిఫ్ట్‌తో మరింత స్పెషల్‌గా మారింది.