బ్రహ్మానందం – బాబూ మోహన్. ఒకప్పుడు సూపర్ హిట్ నవ్వుల జోడీ. వీరిద్దరూ కలిసి నటిస్తే… ఆ ట్రాక్ సూపర్ హిట్టయ్యేది. సినిమాకీ మైలేజీ పెరిగేది. ఇద్దరూ కలిసి కనీసం వంద సినిమాల్లో అయినా నవ్వులు పంచి ఉంటారు. ఆ అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే వీరిద్దరి మధ్య ఓ దర్శకుడు పుల్ల పెట్టే ప్రయత్నం చేశాడు. అతనే శివ నాగేశ్వరరావు.
మనీ, పట్టుకోండి చూద్దాం, వన్ బై టూ లాంటి విజయవంతమైన చిత్రాల్ని అందించిన దర్శకుడు శివ నాగేశ్వరరావు. ఆయన దర్శకత్వంలో రూపొందిన `వన్ బై టూ` ఆదివారంతో 30 ఏళ్లు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా రీ యూనియన్ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకొంది టీమ్. “ఈ సినిమాలో ఘర్షణ చిత్రానికి పేరడీ పెట్టాం. ప్రభు, కార్తీక్ పాత్రల్లో బ్రహ్మానందం, బాబూ మోహన్ ని తీసుకొందాం అనుకొన్నా. కానీ… బ్రహ్మానందం ఒప్పుకోలేదు. బాబూ మోహన్ తో కలిసి నటించను అని చెప్పేశాడు. దాంతో.. బ్రహ్మానందం ప్లేస్ లో సుధాకర్ని తీసుకొన్నాం“ అని శివ నాగేశ్వరరావు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారు. అంటే.. అప్పట్లో బ్రహ్మానందానికీ, బాబూ మోహన్ కి పడేది కాదని పరోక్షంగా చెప్పేశారన్నమాట. ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ బయటకు రాని ఈ విషయాన్ని, 30 ఏళ్ల తరవాత ఓ దర్శకుడు బయటకు లాగాడు. మరి అప్పట్లో బ్రహ్మానందం, బాబూ మోహన్ మధ్య అంతలా ఏం జరిగిందబ్బా? అని చర్చల్లో మునిగిపోయారు సినీ జనాలు. మరి వీరిద్దరూ ఇప్పటికీ ఇలానే ఉన్నారా? లేదంటే కలిసిపోయారా? అనేదే హాట్ టాపిక్. అయ్యిందేదో అయ్యింది, ఇన్నేళ్ల తరవాత మళ్లీ దాన్ని మీడియా ముందు బయట పెట్టడం ఎందుకన్నది మరికొందరి వాదన.