ఉస్మానియా యూనివర్సిటీ శతవసంతాల వేడుకల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడకుండా వెళ్లిపోవడంపై విమర్శలు రావడం తెలిసిన విషయమే, డిఐజి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ గట్టిగా సలహా ఇచ్చిన మేరకే ఆయన ఏమీ మాట్లాడకుండా వుండిపోయారని అధికార వర్గాలు చెబుతున్నాయి. నిజంగానే క్యాంపస్‌లో ఆ రోజున క్లోజ్ సర్య్యూట్ టీవీలలో కెసిఆర్ కనిపించినప్పుడల్లా అక్కడున్న విద్యార్థులు నిరసనగా నినాదాలు చేశారు. ఇవన్నీ రికార్డు కాకూడదనే టీవీ ఛానల్స్‌ను లోపలికి అనుమతించకుండా దూదర్శన్ ద్వారానే ఇప్పించారు. ఇంతకంటే విచిత్రమైన అనుభవం మిమిక్రీ శివారెడ్డికి ఎదురైంది. కళా వేడుకల్లో ఆయన ముఖ్యమంత్రిలా మాట్లాడబోతే విద్యార్థులు వద్దని కేకలు వేసి ఆపేశారట. తర్వాత హీరో బాలకృష్ణ గొంతును అనుకరిస్తే మాత్రం సరదాగా విన్నారు. విద్యార్థులు చాలామందిలో గూడుకట్టుకున్న ఆగ్రహం దీంతో స్పష్టమవుతుంది.ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ నాయకులు కూడా ఉస్మానియా ఉదంతం ఒక మచ్చేనని భావిస్తున్నారు. ఇప్పటికైనా ఆయన కెసిఆర్ విద్యార్థులతో వివరంగా మాట్లాడి సమస్యలు పరిష్కరించి సామరస్యం పెంచాలని కోరుతున్నారు. ఒక విధమైన కక్ష సాధింపు మనసులో వుండిపోవడం వల్లనే ఆయన ఒప్పుకోవడం లేదనే సందేహం కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. 2009లో కెసిఆర్ నిరాహారదీక్ష విరమించినట్టు వార్తలు రాగానే ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన ఉస్మానియా విద్యార్థులు అధికారంలోకి వచ్చాక ఒకసారి కెటిఆర్ అక్కడకు వస్తే నిరసన తెల్పడానికి ప్రయత్నించారు. ఇక కెసిఆర్ అయితే ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా క్యాంపస్‌లోకి అడుగే పెట్టలేదు.