తెలుగు చిత్రసీమ మరో ప్రతిభావంతుడ్ని కోల్పోయింది. కరోనా మహమ్మారి మరో కళాకారుడ్ని బలి తీసుకుంది. ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ ఈరోజు తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన కరోనాతో బాధపడుతూ.. హైదరాబాద్ లోని, ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఆయన పరిస్థితి మరింత క్షీణించడంతో, కొద్ది సేపటి క్రితం మరణించారు. దాదాపు 10 భారతీయ భాషల్లో వందల చిత్రాలకు నృత్య రీతులు సమకూర్చారాయన. `మగధీర`లో ధీర.. ధీర.. పాటకు గానూ ఉత్తమ నృత్య దర్శకుడిగా జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. 1948 డిసెంబరు 7న చెన్నైలో జన్మించారు శివ శంకర్ మాస్టర్. చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే మమకారం. నటరాజ్, శకుంతల మాస్టర్ల దగ్గర దాదాపు ఏడేళ్లు నృత్యం నేర్చుకున్నారు. ఆ తరవాత సుప్రసిద్ధ నృత్య దర్శకుడు సలీమ్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేశారు. సలీమ్ మాస్టర్‌కి అత్యంత ప్రీతి పాత్రుడైన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ దగ్గర్నుంచి చిరంజీవి, బన్నీ, రామ్ చరణ్‌లతోనూ పనిచేశారు. ఖైదీలోని రగులుతోంది మొదలుపొద పాటకు ఈయనే డాన్స్ మాస్టర్. క్లాసికల్ టచ్ ఉన్న పాటలకు ఆయన కేరాఫ్ గా నిలిచారు. మాస్ బాణీలకు చిందులు వేశారు. `మన్మథ రాజా.. మన్మథరాజా` పాట ఒక ఊపు ఊపేసింది. ఉత్తమ నృత్య దర్శకుడిగా నాలుగు సార్లు తమిళనాడు ప్రభుత్వం నుంచి పురస్కారాలు అందుకున్నారు. తెలుగులో ఢీ లాంటి కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. కొన్ని సినిమాల్లోనూ నటించారు. శివ శంకర్ మాస్టర్ని పేరడీ చేస్తూ కొన్ని పాత్రలు పుట్టుకొచ్చాయి కూడా. కొంతకాలం క్రితం శివ శంకర్ మాస్టర్ కరోనా బారీన పడ్డారు. ఆయన కుటుంబం ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో పడినందున దాతల సహాయం తీసుకోవాల్సివచ్చింది. శివ శంకర్ మాస్టర్ వైద్య ఖర్చులు భరించడానికి సోనూసూద్ ముందుకొచ్చాడు. చిరంజీవి రూ.3 లక్షల సహాయం అందించాడు. ధనుష్ కూడా తన వంతు సహాయం చేశాడు. అయితే ఇవేం ఫలించలేదు. శివ శంకర్ మాస్టర్ ప్రాణాలు నిలవలేదు. ఆయన మృతి… చిత్రసీమకు, ముఖ్యంగా డాన్స్ రంగానికి తీరని లోటు.