ఎంపి శశికళను జయ కొట్టారా? ఆ ఎంపినే శివను కొట్టారా?
ఇదే ఇప్పుడు పార్లమెంటులో నాటకీయ తరహాలో నడిచిన ప్రశ్న. విపరీత వివాదాలకు దౌర్జన్యాలకు పెట్టింది పేరైన తమిళనాడులో కూడా ఇలాటి వివాదం ఇంతవరకూ చూసి వుండం. ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలైన శశికళ పేరు కలిగివున్న శశికళ పుష్ప రాజ్యసభ సభ్యురాలు. ఇటీవల విమనాశ్రయంలో ఆమె డింఎంకె ఎంపి తిరుచి శివను కొట్టినట్టు ఆమే చెప్పారు. తమ నాయకురాలు జయలలితను ఆయన దుర్భాషలాడటం భరించలేక చేయిచేసుకున్నానని తెలిపారు.
దీనిపై జయలలిత ఆమెనూ లోక్‌సభ ఉపసభాపతి తంబిదురైని పిలిచి విచారించి పంపించారట. అదే సమయంలో మరోవంక డింఎంకె నాయకత్వం తమ వాళ్లను పిలిపించి విచారించింది. సోమవారం నాడు శశికళ పుష్పను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు గాను బహిష్కరిస్తున్నట్టు ప్రకటన వెలువడింది. ఆ తర్వాత శశికళ రాజ్యసభలో తనకు రక్షణ లేదంటూ విలపించారు. శివ తిరుచ్చి మంచి మనిషి అని తను చేసిన పనికి ఆయన తనను క్షమించాడని ఆమె అన్నారు. అయితే తమ పార్టీ అధినేత తనపై చేయిచేసుకున్నారని ఆరోపించడం సభ అవాక్కయింది. తన ప్రాణాలకు ముప్పు వున్నందున రక్షణ కల్పించాలని ఆమె కోరారు. మీరు చైర్మన్ అన్సారీకి లేఖ రాయొచ్చని ఉపాద్యక్షుడు కురియన్, మంత్రి వెంకయ్య నాయుడు చెప్పగా ప్రాణహాని వుందంటే ఎవరికో లేఖ రాయమంటారా అని ఆమె గొడవ చేశారు. చివరకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తానని చెప్పింది. అయితే ఈ దశలో డిఎంకె నాయకులు ఎలాటి ప్రత్యారోపణలు గాని వివాదం గాని చేయకపోవడం ఆసక్తికలిగించింది. గతంలో ట్యుటికురన్ మేయర్‌గా పనిచేసిన శశికళపై అధినేతకు ఆగ్రహం వుందట. ఆమె శివతో వున్న ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేశారట. ఈ ఆరోపణల నుంచి బయిటపడటానికి శశికళ వీలు చూసుకుని శివపై చేయిచేసుకుని తన నిజాయితీ నిరూపించాలనుకున్నారు. ఆ సమయంలో ఆమెతో తంబిదురై వున్నారట. అయితే ఈ కొత్త వివాదం కూడా జయలలిత ఉపేక్షించదలచలేదు గనకే పోయెస్ గార్డెన్‌కు పిలిపించి చివాట్లు పెట్టారు. అప్పుడు ఆమె శశికళను కొట్టడం కూడా జరిగిందా అన్నది తంబిదురైకి తెలిసి వుండొచ్చు. శశికళ డిఎంకెలోకి వెళ్తారని జయకు అనుమానం వచ్చిన ఫలితంగానే ఇదంతా జరిగిందంటారు.
ఏమైతేనేం? ఇది జాతీయ స్థాయి రచ్చగా మారింది. ఈ దశలో తాము నోరు విప్పడం ఎందుకుని శివతో సహా డిఎంకె నేతలంతా గప్‌చిప్‌గా వుండిపోయారు! కాని పార్లమెంటు చరిత్రలోనే ఒక ఎంపి తమ పార్టీ అధినేతపై ఇలాటి ఆరోపణ చేయడం మాత్రం ఇదే మొదటిసారట. ఇప్పుడు పార్టీయే తనను బహిష్కరించింది గనక శశికళ నిక్షేపంగా మరో పార్టీలో చేరిపోవచ్చు. ఈలోగా తనకు ప్రాణ హాని వుందని అమ్మ కొట్టారని చెప్పారు గనక ఏదైనా జరిగితే జయలలిత బాధ్యత వహించవలసి వుంటుంది. అదీ ఇక్కడ రాజకీయ వ్యూహం.