‘కోర్ట్’ సినిమా శివాజీకి కొత్త జీవితాన్ని ఇచ్చినట్లే . 90s బయోపిక్ నటుడిగా తనకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చినప్పటికీ కోర్ట్ సినిమాలో చేసిన మంగపతి క్యారెక్టర్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై మెరిసేలా చేసింది. నిజానికి ఇలాంటి క్యారెక్టర్ కోసం పాతికేళ్లుగా ఎదురు చూశారు శివాజీ. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు.
శివాజీ నట జీవితం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ప్రారంభమైంది. తర్వాత హీరోగా సినిమాలు చేశారు. అప్పటికి కూడా ఆయనకి నటనకి ఆస్కారం ఉండే పాత్రలు చేయాలని అభిలాష ఉండేది. ఒట్టేసి చెబుతున్నా, ఇంద్ర, జల్సా, చిత్రాలు పాత్ర ని ఇష్టపడి చేసినవే. అయితే తర్వాత కాలంలో ఎందుకో శివాజీకి సరైన అవకాశాలు రాలేదు.
మంగపతి క్యారెక్టర్ ఒక్కసారిగా ఆయనలోని నటవైవిధ్యం గురించి చర్చించుకునేలా చేసింది. శివాజీ డిక్షన్ బాగుంటుంది. తెలుగుని చాలా క్షుణ్ణంగా పలికే నటుడాయాన. ఆయన మొహంలో ప్రతి ఎక్స్ప్రెషన్ పలుకుతుంది. మంగపతి క్యారెక్టర్ తో ఒక కొత్త విలనిజాన్ని ఆయన ప్రదర్శించగలిగాడు. ఇందులో శివాజీని చూస్తే ఆయనకంటూ కొన్ని ప్రత్యేకమైన పాత్రలు వస్తాయనే నమ్మకం అందరికీ కలుగుతుంది.
నటులకు ఒక మంచి బ్రేక్ ఇచ్చే ఒక క్యారెక్టర్ ఉంటుంది. అలాంటి బ్రేక్ మంగపతి పాత్ర శివాజీకి ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత ఉందనే చెప్పాలి. జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, నరేష్, రావు రమేష్.. ఇలా కొద్దిమంది మాత్రమే మెరుస్తున్నారు. బలంగా పాత్రని పండించగల నటులు తక్కువ మందే ఉన్నారు. వాళ్లకు ప్రత్యామ్నాయంగా మెరిసే నటుల అవసరం ఎంతైనా వుంది. గుర్తుపెట్టుకునే నటనని ఇచ్చే నటులకు ఎప్పుడు గిరాకీ ఉంటుంది. మరి మంగపతి క్యారెక్టర్ శివాజీకి ఎలాంటి అవకాశాలను తెచ్చిపెడుతుంది? ఆయన కోసం ఎలాంటి పాత్రలు పుట్టుకోస్తాయో చూడాలి.